అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలతో మన మార్కెట్లూ లాభాల బాటలో సాగాయి. స్మాల్ క్యాప్(Small cap) స్టాక్స్ పరుగులు తీశాయి. నిఫ్టీ కీలకమైన 25,200 పాయింట్ల వద్ద గల కీలకమైన రెసిస్టెన్స్‌ను దాటింది. బుధవారం ఉదయం 393 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex).. అక్కడినుంచి మరో 367 పాయింట్లు పెరిగింది. 106 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty) ఇంట్రాడేలో మరో 116 పాయిట్లు ఎగబాకింది.
చివరికి సెన్సెక్స్ 700 పాయింట్ల లాభంతో 82,755 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 25,044 వద్ద స్థిరపడ్డాయి. సెన్సెక్స్‌లో హెవీవెయిట్ స్టాక్స్ అయిన రిలయన్స్(Reliance), హెచ్‌డీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్, టీసీఎస్ ఒక శాతానికిపైగా పెరిగాయి. డిఫెన్స్ సెక్టార్‌కు సంబంధించిన స్టాక్స్ ఎక్కువగా నష్టపోయాయి. బీఎస్‌ఈ(BSE)లో 2,821 కంపెనీలు లాభపడగా 1,207 స్టాక్స్ నష్టపోయాయి. 137 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 109 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 43 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 14 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద రూ. 2.84 లక్షల కోట్లు పెరిగింది.
ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య సీజ్ ఫైర్ ప్రకటన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు తగ్గాయి. ఎటువంటి కాల్పుల ఉల్లంఘన ఘటనలు చోటు చేసుకోకపోవడంతో మార్కెట్లు ఆశాజనకంగా సాగాయి. ముడి చమురు(Crude oil) ధరలు స్థిరంగా ఉండడం, డాలర్ ఇండెక్స్ బలహీనపడడం, రూపాయి బలోపేతమవుతుండడం, దేశ ఆర్థిక వ్యవస్థ 6 శాతం కంటే ఎక్కువ వేగంతో వృద్ధి చెందే అవకాశాలున్నాయన్న అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.
Stock Market | రాణించిన ఐటీ, టెలికాం షేర్లు..
బీఎస్‌ఈలో ఐటీ(IT) ఇండెక్స్ అత్యధికంగా 1.69 శాతం పెరిగింది. టెలికాం 1.42, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.26 శాతం, హెల్త్‌కేర్ 1.11 శాతం, ఆటో ఒక శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్(Financial services) 0.86 శాతం లాభపడ్డాయి. క్యాపిటల్ గూడ్స్ సూచీ 0.54 శాతం, పీఎస్‌యూ 0.17 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.04 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.59 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.74 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.63 శాతం పెరిగాయి.
Top gainers: బీఎస్‌ఈలో నమోదైన షేర్లలో కిర్లోస్కర్ బ్రదర్స్(Kirloskar Brothers) 19.27 శాతం, జైబాలాజీ ఇండస్ట్రీస్ 15.27 శాతం, సమ్మాన్ క్యాపిటల్ 14.81 శాతం, నెట్‌వర్స్18 మీడియా 13.63 శాతం, బాలాజీ అమైన్స్ 12.42 శాతం పెరిగాయి.
Top losers: గార్డెన్ రీచ్(Garden Reach) 5.65 శాతం, డాటా ప్యాటర్న్స్ 4.96 శాతం, ఐడియా ఫోర్జ్ 4.93 శాతం, పరాస్ డిఫెన్స్ 3.47 శాతం, వీఐపీ ఇండస్ట్రీస్ 3.43 శాతం నష్టపోయాయి.