అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Megastar Chiranjeevi | టాలీవుడ్‌లో ప్రస్తుతం వేతనాల పెంపు సమస్య పెద్ద చర్చగా మారింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ (Telugu Film Industry)ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తోంది. అయితే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber) దీనికి ఒప్పుకోకపోవడంతో వివాదం తీవ్రరూపం దాల్చింది. దీంతో ఇప్పటికే అనేక సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. 30 శాతం వేతనాలు పెంచే నిర్మాతల సినిమాలకే తమ కార్మికులు పనిచేస్తారని ఫెడరేషన్ తేల్చి చెప్పింది. దాంతో కొన్ని నిర్మాణ సంస్థలు ముంబయి నుంచి కార్మికులను తీసుకొచ్చి షూటింగ్‌లు కొనసాగించటంతో సినీ కార్మికులు అడ్డుకుంటున్నారు. దీంతో వివాదం మరింత వేడెక్కింది. అయితే షూటింగ్‌లను అడ్డుకుంటున్న వారికి భవిష్యత్‌లో అవకాశాలు ఇవ్వొద్దని కొందరు నిర్మాతలు(Producers) తేల్చేశారు.
Megastar Chiranjeevi | చిరు సమాధానం కోసం..
ఇతరులను బెదిరించి, షూటింగ్‌లకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. కార్మికుల సమస్యలను అర్థం చేసుకుంటున్నప్పటికీ, బాధ్యతగా వ్యవహరించాలన్నది నిర్మాతల అభిప్రాయం. వివాదం తీవ్రం కావడంతో చిరంజీవి(Megastar Chiranjeevi)ని పలువురు నిర్మాతలు కలిసి చర్చించారు. అల్లు అరవింద్, సుప్రియ, రవిశంకర్, సి. కళ్యాణ్ తదితరులు చిరుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వేతనాల పెంపు అంశం, నిర్మాతల పరిస్థితుల్ని చిరంజీవికి వివరించారు. అయితే షూటింగ్‌లు నిలిపివేయడం బాధాకరమని చిరంజీవి అన్నారు. కార్మికుల సమస్యలూ వినాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు రోజులు వేచి చూసి తన అభిప్రాయం చెబుతానని చిరంజీవి అన్నారు. త్వరలో సినీ కార్మికుల నేతలతో(Film Workers Leaders) మెగాస్టార్ సమావేశం కానున్నారు.
ఫెడరేషన్ బంద్ ప్రకటనను పక్కన పెట్టి దాదాపు పది సినిమాల షూటింగ్(Shootings)లు జరుగుతున్నట్టు సమాచారం. కొన్ని చోట్ల స్థానిక కార్మికులు, మరికొన్ని చోట్ల బయటినుంచి కార్మికులు పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో కొనసాగుతోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న “ది రాజాసాబ్” (The Raja Saab) షూటింగ్ వద్ద వివాదం చోటు చేసుకుంది. “ది రాజాసాబ్” సెట్లో జరిగిన ఘటనలో కొంత ప్రాపర్టీ డ్యామేజ్ అయినట్టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్(Producer TG Vishwaprasad) పేర్కొన్నారు. దానికి బాధ్యులైన కార్మికులపై కేసు దాఖలు చేశారు. చూస్తుంటే ఈ వివాదం త్వరగా పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. వేతనాల భారం పెరగడం వల్ల చిన్న నిర్మాతలు ఇబ్బంది పడతారన్న వాదన కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి జోక్యం ద్వారా ఈ వివాదానికి సానుకూల పరిష్కారం దొరకాలన్నదే సినిమా ప్రేమికుల ఆశ.