అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి బీహార్ రాష్ట్రాన్ని నాశనం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి వలసలకు కారణమయ్యారని నిప్పులు చెరిగారు.
బీహార్ రాష్ట్రం(Bihar State)లో మొత్తం రూ.62,000 కోట్లకు పైగా విలువైన బహుళ నైపుణ్య, విద్యా ప్రాజెక్టులను ప్రధాని మోదీ(PM Modi) శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీహార్ పాలకులపై విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ -కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు.
PM Modi | నితీశ్‌పై ప్రశంసలు..
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్(Bihar CM Nitish Kumar)పై ప్రధాని ప్రశంసలు కురిపించారు. బీహార్ విద్యా వ్యవస్థను సమూలంగా మార్చిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయూ ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. పాఠశాలలను పునర్నిర్మించడం, ఉన్నత విద్యా సంస్థలను విస్తరించడం, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. అంతకు ముందు ఆర్జేడీ హయాంలో విద్యా వ్యవస్థ క్షీణించడం వల్ల బీహార్ నుండి భారీగా వలస పోయారన్నారు. లెక్కలేనన్ని కుటుంబాలు తమ పిల్లలను చదువులు, పని కోసం ఇతర రాష్ట్రాలకు పంపాల్సి వచ్చిందన్నారు.
PM Modi | “జన్ నాయక్” బిరుదుపై..
కాంగ్రెస్(Congress)పై ప్రధాని పరోక్షంగా పదునైన వ్యాఖ్యలతో విమర్శలు గుప్పంచారు. కొంతమంది రాజకీయ నాయకులు గౌరవనీయులైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఓబీసీ ఐకాన్ అయిన జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ వారసత్వాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేరును నేరుగా ప్రస్తావించని ప్రధాని.. ఠాకూర్ గౌరవార్థం “జన్ నాయక్” అనేది సోషల్ మీడియా ట్రోల్స్ సృష్టి కాదని, ప్రజల లోతైన ప్రేమ, గౌరవానికి అది ప్రతిబింబమని వ్యాఖ్యానించారు. గత సంవత్సరం కర్పూరి ఠాకూర్ కు తమ ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేసిందని, బీహార్ లో కొత్తగా ప్రారంభించబడిన జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ నైపుణ్య విశ్వవిద్యాలయానికి విద్య ద్వారా సామాజిక న్యాయం, సమానత్వం, సాధికారత అనే ఆయన ఆదర్శాలను కాపాడటానికి పేరు పెట్టినట్లు ఆయన గుర్తు చేశారు. బీహార్ యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, తమ జీవితాలను, రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి విద్య, నైపుణ్య అభివృద్ధిని సాధనాలుగా ఉపయోగించుకోవాలని కోరారు.