- Advertisement -
Homeబిజినెస్​BSNL 4G | రేపటినుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ‘స్వదేశీ’ 4జి సేవలు.. ప్రారంభించనున్న ప్రధానమంత్రి

BSNL 4G | రేపటినుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ ‘స్వదేశీ’ 4జి సేవలు.. ప్రారంభించనున్న ప్రధానమంత్రి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BSNL 4G | ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌‘ స్వదేశీ’ 4జీ(BSNL Swadeshi 4G) సేవలు రేపటినుంచి(సెప్టెంబర్‌ 27) దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.

శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra Modi) ఈ సేవలను ప్రారంభించనున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. తద్వారా ఫిన్లాండ్‌, స్వీడన్‌, దక్షిణ కొరియా, చైనాల తర్వాత వాణిజ్య నెట్‌వర్క్‌లో సొంత స్వదేశీ టెలికాం సాంకేతికత, పరికరాలను కలిగి ఉన్న ఐదో దేశంగా భారతదేశం నిలవనుంది.

- Advertisement -

సెప్టెంబర్‌ 27న బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ(BSNL 4G) సేవలను దేశవ్యాప్తంగా సుమారు 97,500 కంటే ఎక్కువ సైట్లలో అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) శుక్రవారం తెలిపారు. ఇది క్లౌడ్‌ ఆధారిత నెట్‌వర్క్‌ అని, భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా సులువుగా 5జీకి అప్‌గ్రేడ్‌ కావొచ్చన్నారు. ప్రధాని మోదీ ఒడిశా(Odisha)లోని జార్సుగుడా నుంచి ఈ నెట్‌వర్క్‌ను ప్రారంభిస్తారన్నారు. పలు రాష్ట్రాలలో ఒకేసారి ప్రారంభోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. గువాహటిలో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొంటానని తెలిపారు. డిజిటల్‌ భారత్‌ నిధి(Digital Bharat Nidhi) కార్యక్రమంలో భాగంగా 100 శాతం 4జీ సాచురేషన్‌ ప్రాజెక్టును కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ కింద సుమారు 30 వేల గ్రామాల్లో టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ‘‘ఈ టవర్లు మారుమూల, సరిహద్దు మరియు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలోని 26,700 అనుసంధానం కాని గ్రామాలను కవర్‌ చేస్తాయి.డిజిటల్‌ ఇండియాకు వ్యూహాత్మక సహాయకారిగా ఉంటాయి’’ అని కేంద్ర మంత్రి సింధియా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఫిన్లాండ్‌, స్వీడన్‌, దక్షిణ కొరియా, చైనా మాత్రమే టెలికాం పరికరాల ఉత్పత్తి, తయారీ రంగంలో ఉన్నాయి. భారత్‌ ఇప్పుడు ఆ దేశాల సరసన చేరనుంది.

BSNL 4G | 2023లోనే బీటా సేవలు..

ప్రజలకు తక్కువ ధరలో 4జీ సేవలను అందించేందుకు ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌ను ప్రోత్సహిస్తోంది. దీంతో 2023లోనే పంజాబ్‌ రాష్ట్రంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ 4జీ బీటా సేవలను ప్రారంభించింది. ఈ ఏడాది మార్చి వరకు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నా సాంకేతిక సమస్యలతో ఆలస్యమైంది. దాదాపు లక్ష టవర్ల ద్వారా 4 జీ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. ఇందులో టీసీఎస్‌, తేజస్‌ నెట్‌వర్క్‌తోపాటు సెంటర్‌ పర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం నేతృత్వంలోని కన్సార్షియం పాల్గొన్నాయి.

BSNL 4G | 5జీ వైపు అడుగులు..

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఓవైపు 4 జీ సేవలను ప్రారంభిస్తూనే మరోవైపు 5జీ సేవల వైపు అడుగులు వేస్తోంది. దాదాపు లక్ష టవర్లు 5జీ సేవలకు అప్‌గ్రేడ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. దేశీయ టెలికాం రంగంలో ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ మార్కెట్‌ షేర్‌ 7.4 శాతం ఉంది. దీనిని 25 శాతానికి పెంచడానికి సర్కారు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలలో ప్లాన్లు అందించడం ద్వారా మార్కెట్‌ షేర్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. స్వయం సమృద్ధిని సాధించడానికి స్వదేశీ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని టెలికమ్యూనికేషన్స్‌ విభాగం కార్యదర్శి నీరజ్‌ మిట్టల్‌ అన్నారు. ‘‘భారతీయ కంపెనీలు అభివృద్ధి చేసిన 4జీ టెక్నాలజీ స్టాక్‌ భారతదేశాన్ని ఉత్పత్తి సమర్పణల నాయకత్వ దేశంగా డైనమిక్‌గా మారుతున్న పరిశ్రమలో ఉంచుతుంది’’ అని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News