అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Narendra Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చైనాలో అడుగు పెట్టారు. దాదాపు ఏడేళ్ల తర్వాత శనివారం సాయంత్రం ఆయన తియాంజిన్‌కు చేరుకున్నారు. ఇండియాపై అమెరికా సుంకాల (US tariffs on India) నేపథ్యంలో ప్రధాని బీజింగ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
రెండు రోజుల పాటు జపాన్‌లో (Japan) పర్యటించిన మోదీ అక్కడి నుంచి నేరుగా చైనాకు వెళ్లారు. షాంఘై శిఖరాగ్ర సదస్సు (ఎస్సీవో)లో పాల్గొనడంతో పాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (China President Xi Jinping)తో సమావేశం కానున్నారు. ఏడేళ్ల తర్వాత చైనా గడ్డపై అడుగు పెట్టిన ప్రధానికి బిన్హై అంతర్జాతీయ విమానాశ్రయంలో (Binhai International Airport) ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఘనంగా స్వాగతం పలికారు.
PM Narendra Modi | ముగ్గురు నేతల కీలక భేటీ..
అమెరికా సుంకాల నేపథ్యంలో ప్రధాని చైనా పర్యటనకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధానంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్‌తో (Russian President Vladimir Putin) మోదీ సమావేశం కానుండడం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రధాని మోదీ తొలుత ఆదివారం జరుగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. అలాగే, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
ఈ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా కలవనున్నారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నారన్న కారణాన్ని చూపి అమెరికా (America) ఇండియాపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆతిథ్య చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననుండడం ఆసక్తికరంగా మారింది.
PM Narendra Modi | మెరుగుపడుతున్న సంబంధాలు
ఇండియా, చైనా (India-China) మధ్య కొన్నేళ్లుగా సంబంధాలు దెబ్బ తిన్నాయి. 2020లో గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత పూర్తిగా దిగజారాయి. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యాక ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకు పడుతున్నారు. ప్రధానంగా ఇండియా, చైనాను లక్ష్యంగా చేసుకున్నారు. మారుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, చైనా ఇప్పుడు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా చైనాలో పర్యటిస్తున్నారు.