అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒమన్‌లో పర్యటిస్తున్నారు. బుధవారం ఆ దేశానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. కాగా.. మోదీ గురువారం ఒమన్ ఉప ప్రధాని (Oman Deputy Prime Minister) సయ్యద్ షిహాబ్ బిన్ తారిఖ్ అల్ సైద్‌తో సమావేశం అయ్యారు.
ప్రధాని ఇటీవల మూడు దేశాల పర్యటన నిమిత్తం వెళ్లిన విషయం తెలిసిందే. మొదట ఆయన జోర్డాన్‌లో పర్యటించారు. పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం ఇథియోపియాను (Ethiopia) సందర్శించారు. ప్రస్తుతం ఒమన్‌లో పర్యటిస్తున్నారు. ఆ దేశ ఉప ప్రధానితో పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య మైత్రి బంధం బలోపేతం అవుతుందన్నారు. భారత్ ఆర్థికంగా వేగంగా పురోగమిస్తోందని మోదీ తెలిపారు. గత 12 ఏళ్లలో మౌలిక సదుపాయాలు ఐదు రెట్లు మెరుగయ్యాయని చెప్పారు.
PM Modi | భారతీయులతో సమావేశం
ఒమన్‌లో జరిగిన మైత్రి పర్వ్ కార్యక్రమంలో (Maitri Parv Program) గురువారం మోదీ భారతీయులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశ సంప్రదాయాలు ప్రతి సీజన్‌తోనూ కొత్త ఆలోచనలు, రంగులను తీసుకువస్తాయన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు వారు ఎక్కడ నివసిస్తున్నా వైవిధ్యాన్ని గౌరవిస్తారని ఆయన అన్నారు. భారత ప్రవాసులు సహజీవనం, సహకారానికి సజీవ ఉదాహరణగా మారారని చెప్పారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని తెలిపారు.
PM Modi | స్నేహానికి ప్రతీక
మైత్రి పర్వ్ ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఇది భారత్, ఒమన్ మధ్య స్నేహానికి ప్రతీక అని మోదీ అన్నారు. ఈ పండుగ రెండు దేశాలకు ఉమ్మడి చరిత్ర, సంపన్న భవిష్యత్తును జరుపుకుంటుందని ఆయన అన్నారు. భారతదేశం, ఒమన్ సముద్ర వాణిజ్యం ద్వారా సన్నిహిత సంబంధాలను పంచుకున్నాయని ఆయన గుర్తు చేశారు. భారతీయ వ్యాపారులు ఒకప్పుడు లోథాల్, మాండ్వి, తామ్రలిప్టి వంటి ఓడరేవుల నుంచి మస్కట్, సుర్, సలాలాకు చెక్క పడవల ద్వారా ప్రయాణించేవారని తెలిపారు. ఈ చారిత్రక సంబంధాలను భారత రాయబార కార్యాలయం (Indian Embassy) సంకలనం చేసిన పుస్తకంలో నమోదు చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.