HomeUncategorizedIndia - Russia | రష్యా అధ్యక్షుడితో ఫోన్​లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ట్రంప్​ టారిఫ్స్​...

India – Russia | రష్యా అధ్యక్షుడితో ఫోన్​లో మాట్లాడిన ప్రధాని మోదీ.. ట్రంప్​ టారిఫ్స్​ వేళ కీలక పరిణామం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India – Russia | రష్యా నుంచి ఆయిల్​ దిగుమతి చేసుకుంటున్నందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (US Persident Trump)​ ఓ వైపు భారత్​పై సుంకాలు విధిస్తున్నారు. మరోవైపు భారత్​ రష్యాతో సంబంధాలను మరింత బలపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Putin)తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఫోన్​లో మాట్లాడారు. పలు కీలక అంశాలపై వారు చర్చించారు. ద్వైపాక్షిక అజెండా, ఉక్రెయిన్ ఘర్షణలపై మాట్లాడినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా పోస్ట్​ చేశారు.

ఉక్రెయిన్​ ఘర్షణలపై పుతిన్​ వివరించినట్లు మోదీ పేర్కొన్నారు. ‘‘ నా స్నేహితుడు పుతిన్‌తో చాలా మంచి సంభాషణ జరిగింది. ఉక్రెయిన్‌పై తాజా పరిణామాలను పంచుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపాను. మా ద్వైపాక్షిక ఎజెండాలో పురోగతిని కూడా మేము సమీక్షించాము. భారత్​-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటించాం. ఈ సంవత్సరం చివర్లో భారతదేశంలో అధ్యక్షుడు పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి నేను ఎదురు చూస్తున్నాను” అని మోదీ ఎక్స్​లో పోస్టు చేశారు.

India – Russia | కీలక ఒప్పందాలు

రష్యాతో భారత్​ పలు కీలక ఒప్పందాలు చేసుకోనుంది. ముడి చమురు, ఆయుధాల కొనుగోళ్ల సంబంధించి చర్చించనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్ (NSA Ajith Doval)​ ఇప్పటికే రష్యాలో పర్యటిస్తున్నారు. ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్​తో భేటీ అయ్యారు. ఈ ఏడాది చివరలో పుతిన్​ భారత్​ వస్తారని ఆయన పేర్కొన్నారు. తాజాగా మోదీ సైతం పుతిన్​ పర్యటన కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. కాగా రష్యా –ఉక్రెయిన్​ యుద్ధం విషయంలోనే ట్రంప్​ భారత్​పై సుంకాలు విధించారు. తాజాగా పుతిన్​, మోదీ ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చించడం గమనార్హం.

India – Russia | నాలుగేళ్ల తర్వాత..

రష్యా అధ్యక్షుడు పుతిన్​ భారత్​లో 2021లో చివరిసారి పర్యటించారు. డిసెంబర్​లో ఢిల్లీలో జరిగిన 21వ భారతదేశం-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ గత ఏడాది రెండు సార్లు రష్యాలో పర్యటించారు. జూలైలో 22వ రష్యా-భారత్ శిఖరాగ్ర సమావేశంలో, అక్టోబర్‌లో జరిగిన బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. తాజాగా పుతిన్​ భారత్​ రానున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటనల తర్వాత రెండు దేశాలు తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​ సైతం ఈ నెలాఖరులో రష్యాలో పర్యటించనున్నారు.