అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Modi | యువత విధ్వంసంతో అల్లకల్లోలంగా నేపాల్ లో తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమితులైన సుశీలా కర్కి(Sushila Karki)ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అభినందించారు. అదే సమయంలో హింసాత్మక చర్యలకు పాల్పడిన యువకులు ఇప్పుడు రోడ్లను శుభ్రం చేసే పనిలో పడ్డారని ప్రశంసించారు.
మణిపూర్లో పర్యటించిన ప్రధాని మోదీ(PM Modi).. రూ. 1200 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం ఇంఫాల్ లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. నేపాల్ భారతదేశానికి అత్యంత సన్నిహిత దేశమని తెలిపారు. “నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ ప్రధానమంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, 1.4 బిలియన్ల భారతీయుల తరపున సుశీలా జీకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నేపాల్లో(Nepal) శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు ఆమె మార్గం సుగమం చేస్తుందని నేను విశ్వసిస్తున్నానని’’ పేర్కొన్నారు. పొరుగు దేశానికి భవిష్యత్తులో శాంతి, శ్రేయస్సు చేకూరుతుందని ఆకాంక్షించారు.
PM Modi | యువత పై ప్రశంసలు..
నేపాల్లో జరిగిన సంఘటనలలో మరో విషయం ముఖ్యంగా గమనించదగినదని, కానీ దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని ప్రధాని అన్నారు. జెన్ జెడ్(Gen Z) హింసాత్మక నిరసనల తర్వాత వీధులను శుభ్రం చేస్తున్న నేపాల్ యువతను ప్రశంసించారు. “గత రెండు-మూడు రోజులుగా నేపాల్ యువకులు, మహిళలు… రోడ్లపై శుభ్రపరచడం, పెయింటింగ్ పనులు చేస్తూ చాలా కష్టపడుతున్నారు. వారి చిత్రాలు సోషల్ మీడియాలో వస్తున్నట్లు నేను కూడా చూశాను. వారి సానుకూల ఆలోచన, ఈ సానుకూల పని స్ఫూర్తిదాయకం మాత్రమే కాదు, నేపాల్ కొత్త ఉదయానికి స్పష్టమైన సూచన కూడా. నేపాల్ ఉజ్వల భవిష్యత్తు కోసం నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని మోదీ తెలిపారు.