అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Modi Malaysia visit | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మలేషియా పర్యటన కొనసాగుతోంది. ఆదివారం ఆయన మలేషియా ప్రధానితో భేటీ అయ్యారు.
ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం మలేషియా వెళ్లిన విషయం తెలిసిందే. ఆదివారం కౌలాలంపూర్ (Kuala Lumpur)లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఉత్సవ స్వాగత కార్యక్రమం తర్వాత మాట్లాడుతూ, మలేషియా చూపిన ఆతిథ్యం అధికారిక ఆచారాలకు మించి ఉందని ప్రధాని అన్నారు. మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrahim)కు కృతజ్ఞతలు తెలిపారు. మలేషియా ప్రధాన మంత్రి కార్యాలయ సముదాయం అయిన పుత్రజయలోని పెర్దానా పుత్రలో ప్రధాన అధికారిక స్వాగతం కార్యక్రమం చేపట్టారు. ప్రధాని మోదీకి గార్డ్ ఆఫ్ ఆనర్తో సహా పూర్తి ఆచారబద్ధమైన స్వాగతం లభించింది.
Modi Malaysia visit | ఎంవోయూలపై సంతకాలు
ఇద్దరు నాయకుల మధ్య ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. తమ భాగస్వామ్యాన్ని నూతన శక్తితో ముందుకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు పేర్కొన్నాయి. భారత్, మలేషియా మధ్య విశ్వాసం, స్నేహం మరింత పెరుగుతుందని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కీలక రంగాల్లో ఒప్పందాలు జరిగాయి. MoUలపై ఇరు దేశాల ప్రధానుల సంతకాలు చేశారు. గతేడాది ఏషియన్ శిఖరాగ్ర సమావేశానికి రాలేకపోయానని మోదీ అన్నారు. తన స్నేహితుడి కోసం వీలైనంత త్వరగా మలేషియా వస్తానని చెప్పానని, ఇప్పుడు వచ్చినట్లు తెలిపారు.
వ్యవసాయం, క్లీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ల వరకు ప్రతి రంగంలో ఇరు దేశాల మధ్య సహకారం మరింతగా పెరుగుతోందని మోదీ అన్నారు. నైపుణ్య అభివృద్ధి, సామర్థ్య నిర్మాణంలో కూడా తాము ముఖ్యమైన భాగస్వాములమని స్పష్టం చేశారు. రక్షణ, భద్రతా సహకారం కూడా నిరంతరం బలపడుతోందన్నారు.