HomeUncategorizedGST | దిగిరానున్న ధరలు.. నిలిచిన కొనుగోళ్లు.. జీఎస్టీ శ్లాబ్‌ మార్పుతో తగ్గనున్న ధరలు

GST | దిగిరానున్న ధరలు.. నిలిచిన కొనుగోళ్లు.. జీఎస్టీ శ్లాబ్‌ మార్పుతో తగ్గనున్న ధరలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST | కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ(GST)లో తీసుకువచ్చిన సంస్కరణల(Reforms)తో వివిధ వస్తువుల ధరలు తగ్గనున్నాయి. గతంలో ఉన్న నాలుగు శ్లాబ్‌లను తొలగించి, రెండు శ్లాబ్‌లకు పరిమితం చేయడం, చాలా వస్తువులపై పన్ను భారం తగ్గనుండడంతో ధరలు దిగిరానున్నాయి.

ఇది ఈనెల 23 నుంచి అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాలను విక్రయించే దుకాణాలపై ఎలాంటి ప్రభావం లేకపోయినా.. వాహనాల అమ్మకాలపై మాత్రం ప్రభావం కనిపిస్తోంది. చాలా రకాల వాహనాల ధరలు పది శాతం వరకు తగ్గనుండడంతో చాలా మంది కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో షోరూమ్‌(Show rooms)లు బోసిపోతున్నాయి.

GST | సామాన్యులను ఊరట..

జీఎస్టీ స్వరూపంలో ప్రభుత్వం చేసిన మార్పులు పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటనివ్వనున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్ల(Cars)పై ప్రస్తుతం 28 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. శ్లాబ్‌(Slab)లలో తీసుకువచ్చిన సంస్కరణలతో ఈ భారం పది శాతం తగ్గనుంది. ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ భారం రూ. 8 వేల నుంచి రూ.20 వేల వరకు తగ్గే అవకాశాలున్నాయి. బజాజ్‌ పల్సర్‌(Bajaj Pulsar), హీరో స్ప్లెండర్‌ వంటి వాహనాల ధరలు 10 శాతం తగ్గనున్నాయి.

అలాగే 1500 సీసీలోపు ఉన్న డీజిల్‌, డీజిల్‌ హైబ్రిడ్‌ కార్లు, 1200 సీసీలోపు పెట్రోల్‌, పెట్రోల్‌ హైబ్రిడ్‌, సీఎన్‌జీ, ఎల్‌పీజీ కార్లు గతంలో 28 శాతం జీఎస్టీ శ్లాబ్‌ పరిధిలో ఉండేవి. వీటిని 18 శాతం శ్లాబ్‌ పరిధిలోకి తీసుకురావడంతో పదిశాతం వరకు ధరల భారం తగ్గనుంది. నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవున్న చిన్న కార్ల ధరలు (Cars Prices) రూ.60 వేల నుంచి లక్ష రూపాయల వరకు తగ్గనున్నాయి. నూతన శ్లాబ్‌ ప్రకారం టాటా అల్ట్రోజ్‌(Tata Altroz), హ్యుందాయ్‌ ఐ10, 120, రెనో క్విడ్‌ వంటి కార్ల ధరలు పదిశాతం తగ్గుతాయని భావిస్తున్నారు.

GST | 23 తర్వాత పండుగే..

జీఎస్టీ కొత్త శ్లాబ్‌లు ఈనెల 23 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో వాహనాల షోరూమ్‌లకు దసరా, దీపావళి పండుగలు ముందే రానున్నాయి. జీఎస్టీలో మార్పులతో చాలావరకు వాహనాల ధరలు పది శాతం తగ్గనుండడంతో ప్రస్తుతం చాలామంది వాహనాల కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. 23 తర్వాతే కొనుగోలు చేయనున్నారు. దీంతో షోరూమ్‌లకు ఒక్కసారిగా తాకిడి పెరిగే అవకాశాలున్నాయి. సాధారణంగా దసరా పండుగ సమయంలో వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతుంటారు.

జీఎస్టీ భారం తగ్గుతుండడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ధరలు తగ్గుతుండడంతో అమ్మకాలు పెరుగుతాయని షోరూమ్‌ల నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వ (central government) ప్రకటనతో ప్రస్తుతం వ్యాపార కార్యకలాపాలు స్తంభించినా దసరా నాటికి గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే డిమాండ్‌ ఎక్కువగా ఉంటే దసరా నాటికి వాహనాలు అందుబాటులో ఉండకపోవచ్చు. దీన్ని షోరూమ్‌ల నిర్వాహకులు క్యాష్‌ చేసుకునే అవకాశాలున్నాయి.