అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | స్థానిక ఎన్నిక ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ నెలాఖారులోపు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయా పార్టీలు కూడా స్థానిక పోరుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి.
ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా(Nizamabad District)లో మండలాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పంచాయతీల్లో పాగా వేయాలని, పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటాలని అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీ ప్రణాళికలు వేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి, రాజకీయంగా పట్టు పెంచుకోవడానికి సర్పంచులు, ఎంపీటీసీలే (MPTC) కీలకం కావడంతో అన్ని పార్టీలు సీరియస్‌గా దృష్టి సారించాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నాయి.
Local Body Elections | మండలాల వారీగా సమావేశాలు..
స్థానిక సంస్థల ఎన్నికలకు( Local Body Elections) త్వరలోనే తెర లేవనుండడంతో రెండు జిల్లాల్లో రాజకీయ హడావుడి ప్రారంభమైంది. గ్రామాల్లో ఆశావాహుల సందడి కూడా పెరిగింది. ప్రధాన పార్టీలు తమ కేడర్‌తో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు శ్రేణులతో భేటీలు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో సూచిస్తున్నారు. ఎల్లారెడ్డి(Yella Reddy), కామారెడ్డి(Kamareddy), నిజామాబాద్ రూరల్, బోధన్, జుక్కల్ తదితర నియోజకవర్గాల్లో ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. పార్టీని పటిష్టం చేసేందుకు కీలకమైన ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాల వారీగా ఓట్ల వివరాలు, ఆశావాహులు, ప్రత్యర్థి పార్టీల నుంచి బరిలో నిలిచే వారు.. ఇలా అన్ని వివరాలు సేకరిస్తున్నారు.
Local Body Elections | బరిలోకి ముఖ్య నేతలు..
వచ్చే ఎన్నికలను ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే(Former MLAs)లు సీరియస్‌గా తీసుకున్నారు. తమ రాజకీయ మనుగడకు కీలకమైన స్థానిక పోరుపై తీవ్రంగా దృష్టి సారించారు. ఇప్పటికే బోధన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి కార్యకర్తలతో సమావేశమవుతున్నారు.
అటు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Gampa Govardhan) కూడా ఇటీవల ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్(Jajala Surender), జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే(Hanmanth Shinde) కూడా వరుస భేటీలు వేస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కేటీఆర్ శుక్రవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నేతలతో సమావేశమవుతారని స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
అటు బీజేపీ కూడా రంగంలోకి దిగింది. నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి తదితర నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తోంది. జిల్లా పరిషత్ పై జెండా ఎగురవేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Dharampuri Aravind) ధీమాగా చెబుతుండడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెడతారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
Local Body Elections | భారీగా ఆశావాహులు..
స్థానిక సంస్థల్లో బరిలోకి దిగేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు సన్నాహాలు చేసుకుంటున్నారు. కొంతకాలంగా గ్రామాల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పల్లెల్లో విందు రాజకీయాలకు తెర లేపారు. ఓట్లను ప్రభావితం చేసే వారిని, కుల సంఘాల పెద్దలను మచ్చిక చేసుకుంటున్నారు. ఎవరైనా చనిపోతే అక్కడ వాలిపోతున్నారు. రకరకాల సమస్యల్లో ఉన్న వారికి నగదు సహాయం చేస్తూ, రోగులను దవాఖానాలకు తరలిస్తూ తమకు సానుకూల వాతావరణం ఉండేలా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఒక్కో గ్రామంలో ఒక్కో పార్టీ నుంచి కనీసం ఐదారుగురు పోటీకి సిద్ధమవుతుండడం పార్టీలకు తలనొప్పిగా మారింది. ఎవరికి అవకాశం ఇవ్వాలో, ఎవరిని తప్పించాలో తెలియని పరిస్థితి నెలకొంది. వచ్చే స్థానిక ఎన్నికల్లో అన్ని పార్టీలకు ఇదో సమస్యగా మారుతోంది.