అక్షరటుడే, కామారెడ్డి: Municipal elections | మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు.
Municipal elections | షెడ్యూల్ వెలువడిన వెంటనే..
షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలకు (elections) ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఒక్కోవార్డు వారీగా ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని సూచించారు. ఎన్నికల సంఘం (Election Commission) నిర్దేశించిన విధంగా ముసాయిదా జాబితాను ప్రదర్శించాలని, అభ్యంతరాలను స్వీకరించి సకాలంలో వాటిని పరిష్కరించాలని, జనవరి 10వ తేదీన తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, సదుపాయాలను పరిశీలించాలన్నారు.
Municipal elections | కనీస సౌకర్యాలు..
అవసరమైన చోట కనీస సౌకర్యాలు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్స్, ఫర్నీచర్, విద్యుత్, ర్యాంప్ వంటి వసతులు ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని గుర్తించి, శిక్షణ తరగతుల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా అప్రమత్తతతో ఎన్నికల విధులను నిర్వర్తించాలని అన్నారు.
Municipal elections | నోడల్ ఆఫీసర్లు కీలకం..
మున్సిపల్ ఎన్నికల (Municipal elections) సందర్భంగా వివిధ శాఖల జిల్లా అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. నోడల్ ఆఫీసర్లుగా నియమితులైన వారు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లు, పీఎం ఆవాస్ యోజన (అర్బన్), వీధి కుక్కల నియంత్రణ, శానిటేషన్, ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్, టాక్స్ కలెక్షన్ తదితర అంశాలపై రివ్యూ నిర్వహించి పురోగతిపై ఆరా తీశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధు మోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, సీఈవో చందర్, ఎల్లారెడ్డి, కామారెడ్డి ఆర్డీవోలు పార్థసింహరెడ్డి, వీణ, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.