అక్షరటుడే, ఆర్మూర్: Municipal Elections | మున్సిపల్ ఎన్నికలకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులకు సూచించారు. భీమ్గల్, ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల (municipal elections) నిర్వహణ సన్నద్ధతపై కమిషనర్లు, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
Municipal Elections | షెడ్యూల్ వెలువడిన వెంటనే..
షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో వార్డు వారీగా ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని సూచించారు. ఎన్నికల సంఘం (Election Commission) నిర్దేశించిన విధంగా ముసాయిదా జాబితాను ప్రదర్శించాలని, అభ్యంతరాలను స్వీకరించి సకాలంలో వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు. జనవరి 10వ తేదీన తుది ఓటరు జాబితా వెలువరించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి, సదుపాయాలను పరిశీలించాలన్నారు. అవసరమైన చోట కనీస సౌకర్యాలు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్స్, ఫర్నీచర్, విద్యుత్, లైటింగ్, ర్యాంపు వంటి వసతులు ఉండేలా చూసుకోవాలని అన్నారు.
Municipal Elections | అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా పాలనాధికారి పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని గుర్తించి, శిక్షణ తరగతుల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావులేకుండా అప్రమత్తతతో ఎన్నికల విధులను నిర్వర్తించాలని హితవు పలికారు.
Municipal Elections | అధికారులదే క్రియాశీలక పాత్ర
ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉన్నందున, పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలన్నారు. ఏ దశలోనూ అలసత్వానికి తావు ఇవ్వకూడదని, ఎలక్షన్ షెడ్యూల్ వెలువడిన నాటి నుండి, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమనిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా విధులు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. సమీక్షలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శైలజ, భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్, భీమ్గల్ తహశీల్దార్ మహమ్మద్ షబ్బీర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.