అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bihar CM | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Assembly elections) ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో నితీశ్‌కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు.
బీహార్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 14 కౌంటింగ్ చేపట్టగా.. అధికార ఎన్డీఏ కూటమి 202 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ఈ నెల 19 లేదా 20న నూతన ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ప్రధాని మోదీ షెడ్యూల్ అనుగుణంగా త్వరలో సీఎం ప్రమాణ స్వీకారం తేదీని ఫిక్స్ చేయనున్నారు.
Bihar CM | గాంధీ మైదాన్‌లో..
బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో (Gandhi Maidan) నితీశ్‌కుమార్ ప్రమాణ స్వీకార వేడుక నిర్వహించనున్నారు. సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన సోమవారం కేబినెట్ భేటీ కానుంది. 17వ శాసనసభ రద్దు తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదిస్తుంది. అనంతరం నితీష్‌కుమార్ (CM Nitish Kumar) తన రాజీనామాను గవర్నర్‌కు అందించనున్నారు. అనంతరం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారు. గవర్నర్ అనుమతి మేరకు ఈ నెల 19 లేదా 20న కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు.
Bihar CM | నితీశ్‌కుమార్ రికార్డు
బీహార్ సీఎం (Bihar CM) అత్యధిక సార్లు ప్రమాణ స్వీకారం చేసిన నేతగా నితీశ్‌కుమార్ రికార్డు సృష్టించారు. అలాగే ఆయన సుదీర్ఘ కాలంగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 1951లో జన్మించిన ఆయన తొలి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మూడోసారి 1985లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.. అనంతరం ఎంపీగా సైతం గెలుపొంది కేంద్ర మంత్రిగా పని చేశారు. 2000 మార్చి 3న తొలిసారి బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అప్పుడు ఏడు రోజులు మాత్రమే పదవిలో కొనసాగారు. అనంతరం 2005లో రెండోసారి సీఎం అయ్యారు. అప్పటి నుంచి నితీశ్‌కుమార్ బీహార్ సీఎంగా కొనసాగుతుండడం గమనార్హం.
