అక్షరటుడే, వెబ్డెస్క్: Municipal Elections | రాష్ట్ర ప్రభుత్వం (State Government) మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధం అయింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం 2025 జనవరిలో ముగిసింది. అప్పటి నుంచి బల్దియాల్లో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలను (Panchayat Elections) నిర్వహించిన ప్రభుత్వం ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కోసం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం (Election Commission) సైతం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మున్సిపల్ ఎన్నికల ఓటరు జాబితా ముసాయిదాను ఇటీవల అధికారులు విడుదల చేశారు.
Municipal Elections | పార్టీల నేతలతో సమావేశం
ఓటరు జాబితా ముసాయిదాపై అధికారులు ఇప్పటికే అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. మొత్తం 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా మున్సిపాలిటీ ఆఫీసుల్లో సోమవారం, మంగళవారం అధికారులు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే మున్సిపాలిటీల పరిధిలో ఉండే బీజేపీ,కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పొలిటికల్ పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లలో ఆల్ పార్టీ మీటింగ్స్ నిర్వహించనున్నారు. ఓటరు జాబితాపై ఈ సమావేశంలో చర్చిస్తారు. అనంతరం ఈ నెల 10న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు.
Municipal Elections | సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్
సంక్రాంతి తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. తుది ఓటరు జాబితా ప్రకటించిన తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రిజర్వేషన్లు తేలగానే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ వస్తుందని, ఫిబ్రవరిలో తొలివారంలో ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్లు, పోలింగ్ ఆఫీసర్లు, సెక్టార్ ఆఫీసర్ల నియామకం కోసం ఉద్యోగుల జాబితాను అధికారులు సిద్ధం చేస్తున్నారు.