అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Consumer Forum | గర్భిణి మృతి కారణమైన ప్రైవేట్ ఆస్పత్రికి వినియోగదారుల ఫోరం షాక్ ఇచ్చింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె చనిపోవడంతో రూ.కోటి జరిమానా విధించింది.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం (Chityal Mandal) ఆరెగూడెం గ్రామానికి చెందిన అస్నాల స్వాతి 2018 జులై 13న డెలివరీ కోసం నార్కట్‌పల్లిలోని కామినేని హాస్పిటల్ (Narkatpally Kamineni Hospital)లో చేరింది. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి బాబును బయటకు తీశారు. అయితే మరుసటి రోజు ఉదయం వరకు కూడా స్వాతి కళ్లు తెరవలేదు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశ్నించగా.. ఆపరేషన్ సమయంలో మత్తు మందు డోస్ సరిపోకపోవడంతో, రెండో డోస్ ఇచ్చినట్లు చెప్పారు. స్పృహలోకి రావడానికి సమయం పడుతుందన్నారు. కుటుంబ సభ్యులు, గ్రామపెద్దల నిలదీయడంతో ఆమెను ఐసీయూలోకి తరలించారు.
Consumer Forum | కోమాలోకి వెళ్లిందని..
స్వాతి కోమాలోకి వెళ్లిందని కుటుంబ సభ్యులకు చెప్పారు. హైరిస్క్ పేపర్‌పై సంతకం చేయించుకొని వైద్యం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కొద్దిసేపటికే స్వాతి చనిపోయిందని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యంతోనే స్వాతి చనిపోయిందని ఆమె భర్త క్రాంతికుమార్, తండ్రి సత్యనారాయణ న్యాయవాది నర్సింహారెడ్డి ద్వారా నల్గొండ జిల్లా (Nalgonda District) వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు.
Consumer Forum | విచారణ చేపట్టి..
ఈ ఘటనపై వినియోగదారుల ఫోరం విచారణ చేపట్టింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే స్వాతి చనిపోయిందని నిర్దారించింది. ఈ మేరకు బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది. ఇందులో రూ.90 లక్షలు స్వాతి కుమారుడు దేవాన్ష్ శౌర్య పేరున బ్యాంకులో డిపాజిట్ చేయాలని, రూ. 10 లక్షలను స్వాతి తండ్రికి ఇవ్వాలని సూచించింది. మరో రూ.లక్షను సైతం ఫైన్ వేసింది. మొత్తం డబ్బులను నెల రోజుల్లోగా బాధిత కుటుంబానికి చెల్లించాలని, లేదంటే 9 శాతం వడ్డీ కలిపి చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేసింది.
