అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhadrachalam | ఒకప్పుడు అందాల పోటీలు అంటే ఉన్నత వర్గాలకే పరిమితమైన వేదికలుగా భావించేవారు. సామాన్య కుటుంబాల యువత ఈ రంగాన్ని దూరంగా చూసేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు ఆలోచనల్లో వచ్చిన మార్పు… ఎన్నో అసాధారణ విజయాలకు దారి తీస్తోంది.
తాజాగా అలాంటి ఓ స్ఫూర్తిదాయక కథ భద్రాచలం నుంచి వెలుగులోకి వచ్చింది.భద్రాచలం అశోక్‌నగర్ (Ashoknagar) కొత్తకాలనీకి చెందిన ప్రీతి యాదవ్ జాతీయ స్థాయి అందాల పోటీలో ప్రతిభ చాటి ‘మిస్ టీన్ తెలంగాణ’ (Miss Teen Telangana) కిరీటాన్ని సొంతం చేసుకుంది. డిసెంబర్ 19 నుంచి 21 వరకు జైపూర్ వేదికగా నిర్వహించిన ‘మిస్ టీన్ ఫరెవర్ – ఫరెవర్ స్టార్ ఇండియా సీజన్-5’ పోటీల్లో ఆమె ఈ ఘనత సాధించింది.
Bhadrachalam | ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికే విజేత
ప్రీతి యాదవ్ ప్రస్తుతం భద్రాచలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. తెలంగాణ తరఫున ఈ పోటీల్లో పాల్గొన్న ఆమె… కఠినమైన వడపోతలను దాటి చివరకు విజేతగా నిలిచింది. ర్యాంప్‌పై ఆత్మవిశ్వాసంతో నడక, సామాజిక బాధ్యతపై అవగాహన, నాయకత్వ లక్షణాలు, స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం వంటి అంశాల్లో జడ్జీలను ఆకట్టుకుంది. ఈ మిస్ టీన్ పోటీ (Miss Teen Competition)లకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏడాది ముందే ఆన్లైన్ ద్వారా ప్రారంభమైంది. నిర్వాహకులు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో దేశవ్యాప్తంగా సుమారు 10 వేల మంది పాల్గొన్నారు. అందం, ఆత్మవిశ్వాసం, లక్ష్యాల స్పష్టత వంటి అంశాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు.
ఈ ప్రక్రియలో తెలంగాణ (Telangana) నుంచి 40 మంది అర్హత సాధించగా, తుది దశలో టీనేజ్ విభాగంలో ప్రీతి యాదవ్‌ను జడ్జీలు ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 101 మంది పోటీలో పాల్గొనగా… తెలంగాణకు ‘మిస్ టీన్’ కిరీటాన్ని అందించింది ప్రీతి. ఆమె తల్లిదండ్రులు ఉదయ్ ప్రకాశ్ యాదవ్ – రేణు దంపతులు. వీరి స్వస్థలం ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh). ఉపాధి నిమిత్తం సుమారు 20 ఏళ్ల క్రితం భద్రాచలానికి వచ్చి స్థిరపడ్డారు. ప్రీతి తండ్రి ప్రస్తుతం పానీపూరి బండి నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సామాన్య కుటుంబానికి చెందిన కుమార్తె రాష్ట్ర స్థాయి అందాల కిరీటం సాధించడంతో స్థానికంగా అభినందనల వెల్లువ కొనసాగుతోంది. విజేతగా నిలిచిన తర్వాత ప్రీతి మాట్లాడుతూ… “నాకు కూడా ఐశ్వర్య రాయ్ లాంటి ప్రపంచ స్థాయి అందాల పోటీల్లో పాల్గొని భారతదేశానికి పేరు తీసుకురావాలన్న కల ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది” అని తెలిపింది.