అక్షరటుడే, కామారెడ్డి : Collector Kamareddy | వర్షాలు పడే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్ఛార్జీలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆదేశించారు.
సదాశివనగర్ (Sadashivnagar) మండల కేంద్రంతో పాటు ఉప్పల్వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ శాఖ (Meteorological Department) సూచనల మేరకు తుపాను ప్రభావం వలన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
జిల్లాలో ఆన్ని వరి కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను చేయాలని సూచించారు. రైతులు నష్టపోకుండా, ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ కవర్లతో పాటు అవసరమైన సౌకర్యాలు వెంటనే వేగవంతం చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Collector Nizamabad | రానున్న రోజుల్లో వర్ష ప్రభావం..
రానున్న రోజుల్లో వర్ష ప్రభావంతో అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షించాలన్నారు. రైస్‌మిల్ వద్ద వడ్ల సంచులు దించుకున్న వెంటనే రిసిప్ట్ పొంది వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాల్సిందిగా సెంటర్ ఇన్‌ఛార్జీకి సూచించారు.
జిల్లాలో మొత్తం 427 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఇందులో 233 ప్యాక్స్ కేంద్రాలు, 193 ఐకేపీ కేంద్రాలున్నాయని తెలిపారు. ఏ గ్రేడ్ రకం క్వింటాలుకు రూ.2,389, సాధారణ రకం క్వింటాలుకు రూ.2,369 ధరకు ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. కలెక్టర్ వెంట డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీఆర్వో మదన్ మోహన్, డీసీవో రామ్మోహన్, క్లస్టర్ ఆఫీసర్ లక్ష్మణ్, ఇతర అధికారులు ఉన్నారు.

