అక్షరటుడే, భీమ్గల్ : Bhimgal | భీమ్గల్ మండలం మెండోరా (Mendora) గ్రామంలో వర్షాల కోసం గత ఐదు రోజులుగా కప్పతల్లి పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం వరద పాశం సమర్పణ జరిపించారు. తొలి రోజు నుంచి గ్రామంలోని ప్రతి ఇంటికి కప్పతల్లులను తీసుకెళ్లి జలాభిషేకం చేయించారు. భక్తులు సమర్పించిన బియ్యంతో భారీ పాత్రలో పాయసం (పాశం) తయారు చేశారు. అనంతరం వరద పాశం పేరుతో గంగమ్మ తల్లికి సమర్పించారు.
గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఐదు రోజుల క్రితం తడపాల్ గోదావరి (Godavari) నుంచి ప్రత్యేకంగా జలాలను తీసుకువచ్చారు. అనంతరం కప్పలకు కల్యాణం జరిపించి ప్రార్థనలు చేశారు. అలాగే గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు. ఆదివారం ముగింపు సందర్భంగా భక్తులు సమర్పించిన బియ్యంతో పాశం తయారుచేసి గ్రామ పెద్ద చెరువు మధ్యలో ఉన్న పాశం బండపై పాత్రను బోర్లించి గంగమ్మ తల్లికి వరద పాశం సమర్పించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు గౌరు రాజన్న, ఉపాధ్యక్షుడు సాయిబాబా కోశాధికారి గాజరి గంగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగారెడ్డి, రాజేందర్, జలంధర్, మహేష్, దత్తు పాల్గొన్నారు.