అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mahakali | ‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ (Director Prashanth Varma), తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే ‘మహాకాళి’ .
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్లు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచగా.. ఇప్పుడు మహాకాళి (Mahakali) పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన న్యూ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో గూస్‌బంప్స్ క్రియేట్ చేస్తోంది. భూమి శెట్టి ఈ చిత్రంలో మహా శక్తిగా, చెడును అంతం చేసే రౌద్రరూపంలో కనిపించనుంది. నల్లని ముఖం, ముక్కుపుడక, భయంకర కళ్లతో మహాదేవి రూపం నిజమైన భక్తిని, భయాన్ని కలగలిపినట్టుగా ఉంది.
Mahakali | పవర్ ఫుల్ పోస్టర్..
సృష్టి విశ్వ గర్భం నుంచి విశ్వంలోని అత్యంత క్రూరమైన సూపర్ హీరో మేల్కొంటాడు. భూమిశెట్టిని ‘మహా’గా పరిచయం చేస్తున్నాం అని మూవీ టీమ్ పేర్కొంది. సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో (Hyderabad) ప్రత్యేకంగా వేసిన గ్రాండ్ సెట్‌లో షూటింగ్ కొనసాగుతోంది. ఈ పాత్ర ద్వారా భూమి శెట్టి (Bhumi Shetty) తన కెరీర్‌లో కొత్త మైలురాయిని సృష్టించబోతున్నట్లు టాక్. ఈ చిత్రం భారతదేశంలోనే మొదటి ఫీమేల్ సూపర్ హీరో మూవీగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు.
‘మహాకాళి’ని ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ (Riwaz Ramesh Duggal) నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తోనే ఆర్కేడీ స్టూడియోస్ నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. కథ, స్క్రీన్‌ప్లేను ప్రశాంత్ వర్మ అందించగా, దర్శకత్వ బాధ్యతలు పూజా అపర్ణ కొల్లూరు చేపట్టారు. బెంగాల్ సంస్కృతి నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా డివోషనల్ టచ్‌తో పాటు ఫెరోషియస్ యాక్షన్ సన్నివేశాలను కలిపిన మిస్టికల్ సూపర్ హీరో డ్రామాగా ఉంటుందని సమాచారం. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కనిపించిన విజువల్స్, పులి నుదిటిని తాకే అమ్మాయి, మంటల్లో మునిగిన ఫెర్రిస్ వీల్, బెంగాలీ ఫాంట్‌లో రూపుదిద్దుకున్న టైటిల్ ఇవన్నీ సినిమాపై మరింత ఆసక్తి రేపుతున్నాయి. సినిమాకు సంగీతం స్మరణ్ సాయి అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

