అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Prashant Kishore | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎన్నికల వ్యూహకర్త, జనసూరాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణకు వచ్చి మరీ రేవంత్‌రెడ్డిని ఓడిస్తానని శపథం చేశారు.
వివిధ పార్టీలు మారిన రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) ఇతర పార్టీల గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కన్నా బీహార్ ప్రజల డీఎన్‌ఏ నాసిరకమని అవహేళన చేసి బీహారీలను రేవంత్‌రెడ్డి అవమానించారన్నారు. బీహార్ ప్రజలను అవమానించే హక్కు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. టైమ్స్ నౌకి ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డిని రాహుల్ గాంధీ కూడా రక్షించలేరని స్పష్టం చేశారు.
Prashant Kishore | బీహారీలను అవమానిస్తారా?
గతంలో రేవంత్‌రెడ్డి బీహారీలను అవమానించేలా మాట్లాడారని పీకే మండిపడ్డారు. ‘‘తెలంగాణ ప్రజల కన్నా బీహారీల డీఎన్‌ఏ నాసిరకమని ఆయన అంటున్నాడు. అదే నిజమైతే సాయం చేయండంటూ నన్ను ఎందుకు అడుక్కున్నాడు? రాహుల్ గాంధీ(Rahul Gandhi) కూడా ఆయనను కాపాడలేరు. ఆయనను ఎవరూ కాపాడలేరు. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఓడించి తీరతాననని” పీకే హెచ్చరించారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డితో పాటు తమిళనాడులో స్టాలిన్‌ను కూడా ఓడిస్తానని స్పష్టం చేశారు. గత ఎన్నికలకు ముందు వారిద్దరు తన సేవలను ఉపయోగించుకుని, ఇప్పుడు బీహార్‌కు వచ్చి బీహారీలను అవమానిస్తున్నారని మండిపడ్డారు.
Prashant Kishore | మూడు పార్టీలు మారిన రేవంత్..
బీహారీలను అవమానిస్తున్న రేవంత్‌రెడ్డి గత చరిత్ర ఏమటో ఒకసారి గుర్తు చేసుకోవాలని ప్రశాంత్ కిశోర్ హితవు పలికారు. బీజేపీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ తర్వాత టీడీపీలో చేరి, అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు తన మద్దతు అడిగాడని చెప్పారు. ఒకటి, రెండు సార్లు కాదు మూడుసార్లు వచ్చి తన మద్దతు అడిగాడని తెలిపారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు ఎంత గర్వం తలకెక్కిందంటే మా బీహారీలనే అవమానించారని పీకే మండిపడ్డారు. మా కన్నా మీ డీఎన్‌ఏ గొప్పదైతే సాయం కోసం మా దగ్గరకు ఎందుకు వచ్చావు అంటూ నిలదీశారు. బీహారీలను అవమానించిన రేవంత్‌రెడ్డికి బీహారీని అయిన తాను తగిన బుద్ధి చెబుతానన్నారు. తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఆయన ఓటమికి పని చేస్తానని ప్రకటించారు.