అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Prakash Raj | ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం గడుస్తోంది. టీడీపీ – జనసేన – బీజేపీ పార్టీలు ఇప్పటివరకు ఎటువంటి గొడవలు లేకుండా కలిసి పని చేస్తూ ముందుకెళ్తున్నాయి. ఇప్పటి వరకు సమన్వయం బాగున్నప్పటికీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల
(Vice President Election)పరిణామాలు, అలాగే కేంద్రం తెస్తున్న ఓ కొత్త చట్టం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ బిల్లులో, మంత్రులు, ముఖ్యమంత్రులు లేదా ప్రధాని ఎవరికైనా ఒక నెల పాటు జైలు శిక్ష పడితే, వారు తన పదవిని ఆటోమేటిక్‌గా కోల్పోవాల్సి వస్తుంది.
Prakash Raj | ప్రకాశ్ రాజ్ మాటల వెనక అర్ధం?
ప్రస్తుతం ఈ బిల్లును విపక్షాల ఆందోళనల నేపథ్యంలో జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) కి పంపించారు. త్వరలో సవరణలతో మళ్లీ ఆమోదించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ (Prakash Raj) సంచలన ట్వీట్ చేశారు. “ఒక చిన్న సందేహం మహాప్రభూ… మీరు తెచ్చే బిల్లుల వెనక, ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ, మాజీ ముఖ్యమంత్రి కానీ మీ మాట వినకపోతే అరెస్ట్ చేసి… మీ మాట వినే ఉపముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేయాలనే కుట్ర ఉందా?” అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రకాశ్ రాజ్ ఎవరినీ పేరుపెట్టకపోయినా, ట్వీట్‌లోని వ్యాఖ్యలు స్పష్టంగా నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లను సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2024 ఎన్నికలలో జనసేన – టీడీపీ కలిసి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయగా, బీజేపీ(BJP) పెద్దగా కీలకపాత్ర పోషించకుండా కూటమిలో భాగమైనట్టే ఉంది. కానీ గతంలో జనసేన- బీజేపీ కలయికతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే వ్యూహం బీజేపీకి ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త బిల్లుతో, ప్రస్తుత ముఖ్యమంత్రులు ఏదైనా కారణాలతో జైల్లోకి వెళ్లితే, వారి స్థానంలో పవన్ కళ్యాణ్‌కు సీఎంగా అవకాశం కల్పించాలనే వ్యూహం వుందా? అనే అనుమానాన్ని ప్రకాష్ రాజ్ సూచించడం చర్చనీయాంశమైంది. ఏపీ(Andhra Pradesh)లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిలకడగా ఉన్నప్పటికీ , కేంద్రం తీసుకొచ్చే చట్టాలు, బీజేపీ వ్యూహాలు, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు కలిపి రాజకీయ భవిష్యత్తుపై ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి