అక్షరటుడే, ఇందూరు: Prajapalana Dinotsavam | వెట్టిచాకిరి, భావవ్యక్తీకరణపై ఆంక్షలు, మాతృభాష అణిచివేత నుంచి 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ (Hyderabad) సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందని సీఎం సలహాదారు వేం.నరేందర్ రెడ్డి (CM Advisor Narender Reddy) అన్నారు.
తెలంగాణ 2వ ప్రజాపాలన దినోత్సవం (Prajapalana Dinotsavam) వేడుకలు బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం సుస్థిర ప్రజాపాలనతో సంక్షేమాన్ని పంచుతూ.. సర్వమతాలను ఆదరిస్తూ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచిందన్నారు.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా ఆదర్శవంతమైన పల్లెలు పట్టణాలతో ప్రభవిల్లుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుంటుందని, ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల మేరకు ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తోందన్నారు. ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం మహిళల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి పలు పథకాలు తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు.
Prajapalana Dinotsavam | రైతులకు అండగా..
జిల్లాలో వానకాలంలో ఇప్పటివరకు 5.47 లక్షల వేల ఎకరాల్లో రైతులు ఆయా పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టామని, రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 97,696 మంది రైతులకు పంట రుణాలు రూ.755 కోట్లు రుణమాఫీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల చొప్పున సాయం ప్రకటించామని, జిల్లాలో ఇప్పటివరకు 2.72 లక్షల మంది రైతుల బ్యాకు ఖాతాలో రూ.316 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. అలాగే రైతు బీమాకు అర్హులైన 966 మంది రైతులకు రూ.48 కోట్లు జమ చేసినట్లు పేర్కొన్నారు.
Prajapalana Dinotsavam | కీలక సంస్కరణ భూభారతి..
కీలక సంస్కరణల్లో ఒకటిగా భూభారతి చట్టం నిలిచిందని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా భూ పరిపాలనలో పారదర్శకత, భద్రత, ప్రజలకు సులభమైన సేవలు అందించే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. జిల్లాలో అన్ని మండలాల్లో ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు అవగాహన సదస్సులు నిర్వహించబడ్డాయని పేర్కొన్నారు.
రెవెన్యూ సదస్సుల వలన భూ సంబంధిత సమస్యలు గ్రామస్థాయిలోనే పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో జూన్ 3 నుంచి 20 వరకు నిర్వహించిన సదస్సులో 40,462 దరఖాస్తులు అందాయన్నారు. అవి వివిధ దశల్లో పరిష్కారానికి దగ్గరలో ఉన్నాయన్నారు.
Prajapalana Dinotsavam | ఇందిరమ్మ ఇల్లు..
ఇంటి స్థలం ఉన్నవారు, ఇల్లు లేని వారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్న వారికి అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థికసాయం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వేం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. తొలివిడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing Scheme) మంజూరు చేశామన్నారు. జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా.. 18,155 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇప్పటికే 953 ప్రారంభించబడ్డాయన్నారు. ఇప్పటివరకు 84.14 కోట్ల ఖర్చు చేయడం జరిగిందన్నారు.
Prajapalana Dinotsavam | మహాలక్ష్మి పథకం..
మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) ద్వారా రూ. 500కు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అర్హులైన రేషన్ కార్డుదారులకు ఇస్తున్నామని సీఎం సలహాదారు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 10.19 లక్షల సిలిండర్లకు రూ.30 కోట్లు సబ్సిడీ విడుదల చేసి చెల్లించామన్నారు.
జిల్లాలో వానాకాలం సీజన్లో 676 కేంద్రాల ద్వారా 4.91లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రూ.1,140 కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. అలాగే యాసంగి సీజన్లో 700 కేంద్రాల ద్వారా 8.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.1,949 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని గుర్తు చేశారు.
Prajapalana Dinotsavam | ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా
మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. జిల్లాలో 6.30 కోట్లమంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని వినియోగం చేసుకున్నారన్నారు. ఈ పథకం వల్ల జిల్లాలోని మహిళలకు రూ.260 కోట్లు ఆదా అయ్యిందని పేర్కొన్నారు. సగటున ప్రతిరోజూ లక్ష మంది మహిళా ప్రయాణికులు ఉచిత రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్ జెండర్లు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని సూచించారు.
Prajapalana Dinotsavam | వైద్య ఆరోగ్యశాఖ..
రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పోరేట్ స్థాయి వైద్యం అందించాలని ఉద్దేశంతో దారిద్యరేఖకు దిగువగా ఉన్న పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య పథకంతో కలిపి ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన (Prime Minister’s Health Scheme), రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
ఈ పథకాల్లో భాగంగా గతంలో ఉన్న ఒక కుటుంబానికి రూ.5 లక్షల పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,211 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. పౌష్టికాహారం అందించడంలో భాగంగా నెలకు 500 చొప్పున ఇప్పటివరకు 8,523 మందికి రూ. రెండు కోట్లు అందించడం జరిగిందని తెలిపారు.
Prajapalana Dinotsavam | అమ్మ ఆదర్శ పాఠశాల..
జిల్లాలో 760 పాఠశాలలో అత్యవసర మరమ్మతు పనులు మంజూరు చేయబడ్డాయని, వీటిలో 598 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ పథకానికి ఇప్పటివరకు రూ.22 కోట్లు ఖర్చు చేశామన్నారు. 2024-25లో నూతనంగా రెండు కేజీబీవీ పాఠశాలలు మంజూరు చేయబడ్డాయని, ఈ విద్యా సంవత్సరం నుంచి ధర్పల్లి, ఇందల్వాయి, మెండోరా, రుద్రూర్, మోపాల్ కేజీబీవీలో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టామన్నారు.
Prajapalana Dinotsavam | షెడ్యూల్.. గిరిజన అభివృద్ధి..
జిల్లాలోని 32 సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో 2398 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించామన్నారు. ఈ ఏడాది కులాంతర వివాహాలు చేసుకున్న నాలుగు గంటలకు రూ.10 లక్షలు ఆర్థిక ప్రోత్సాహం మంజూరు చేశామన్నారు. అలాగే జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 10 విద్యాసంస్థలు వసతి గృహాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది వసతి గృహ విద్యార్థుల నిర్వహణ కోసం రూ. కోటి విడుదల చేయడం జరిగిందన్నారు.
Prajapalana Dinotsavam | రోడ్లు భవనాల శాఖ..
2024 – 25లో రూ.18 కోట్లతో 8 కిలోమీటర్ల రహదారి అభివృద్ధి చేయడానికి పని మంజూరు కాగా.. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందన్నారు. మాధవనగర్ వద్ద ఆర్వోబీ పనికి రూ.93 కోట్లు, అర్సపల్లి ఆర్వోబీ పనికి రూ.177 కోట్లు మంజూరు చేయబడ్డాయని, పనులు అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు.
జిల్లాలో 8 భారీ మధ్యతరహా పరిశ్రమలు రూ.368 కోట్లతో స్థాపించబడ్డాయని సీఎం సలహాదారు తెలిపారు. వీటి ద్వారా 7,324 మందికి ఉపాధి కల్పించబడిందన్నారు. అలాగే 856 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు రూ.485 కోట్లతో స్థాపించినట్లు చెప్పారు.
Prajapalana Dinotsavam | శాంతి భద్రతల పరిరక్షణ..
డయల్ 100 ఫోన్ కాల్‌కు సాధ్యమైనంత తొందరగా ఐదు నిమిషాల్లో సమస్య పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్ రాకుండానే టీఎస్ కాప్, ట్విట్టర్, హ్యాక్ ఐ, ఫేస్బుక్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే న్యాయం అందేలా చూస్తున్నామన్నారు. శాంతి భద్రతలను సామరస్యాన్ని కాపాడినందుకు.. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నందుకు పోలీస్ యంత్రానికి అభినందనలు తెలిపారు.
Prajapalana Dinotsavam | ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సిద్ధార్థ కళాక్షేత్ర, నవీపేట, కంజర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, బోర్గాం(పి) ఉన్నత పాఠశాల, డిచ్పల్లి మానవతా సదన్ చిన్నారులు నృత్యాలను ప్రదర్శించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా ఛైర్మన్ కేశ వేణు (NUDA Chairman Kesh Venu), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya), అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీసీసీబీ ఛైర్మన్ రమేశ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పగంగారెడ్డి, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య తదితరులు
కార్యక్రమానికి హాజరైన అధికారులు
హాజరైన అధికారులు
నృత్య ప్రదర్శనలో ప్రతిభ చూపిన బోర్గాం(పి) ఉన్నత పాఠశాల విద్యార్థులకు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తదితరులు