అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Putin | ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధానికి నాటో దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. ఉక్రెయిన్‌ను నాటోలోకి లాక్కోవాలని పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు సంక్షోభానికి కారణమని ధ్వజమెత్తారు.
సంక్షోభ పరిష్కారానికి భారత్, చైనా చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. సోమవారం టియాంజిన్‌లో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ (Shanghai Cooperation Organization) హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ ప్రసంగిస్తూ.. ఇండియా, చైనాలపై ప్రశంసలు కురిపించారు. సంక్షోభానికి పరిష్కారం కోరుతూ భారత్, చైనా నిర్మాణాత్మక పాత్రలను ప్రశంసించారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని “మోదీ యుద్ధం”గా వివాదాస్పదంగా అభివర్ణించిన వైట్ హౌస్ (White House) మాజీ సలహాదారు పీటర్ నవారో చేసిన వాదనలను ఆయన తిప్పికొట్టారు. నాటో, పాశ్చాత్య జోక్యామే యుద్ధానికి మూల యుద్ధానికి కారణమని గుర్తు చేశారు. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారాన్ని సులభతరం చేయడానికి చైనా, భారతదేశం చేసిన ప్రయత్నాలు, ప్రతిపాదనలను ఎంతో అభినందిస్తున్నట్లు తెలిపారు.
Putin | పరిష్కార మార్గాలకు అన్వేషించాలి
సంక్షోభాలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని పుతిన్ (Putin) నొక్కి చెప్పారు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధానికి మూల కారణాల్లోకి వెళ్లి పరిశీలించాలన్నారు. ఇది ఆక్రమణతో పుట్టుకొచ్చిన యుద్ధం కాదని, పశ్చిమ దేశాల జోక్యంతో ఏర్పడిన సంక్షోభమని తెలిపారు. ఏ దేశం కూడా మరో దేశాన్ని బలి పెట్టి రక్షణ పొందలేదన్న సూత్రాన్ని తాము నమ్ముతామన్నారు. ఉక్రెయిన్ (Ukraine) సంక్షోభానికి శాంతియుత పరిష్కారానికి వారి చర్చలు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. “ఇటీవల అలాస్కాలో జరిగిన రష్యా – అమెరికా సమావేశంలో కుదిరిన అవగాహనలు కూడా ఈ లక్ష్యాన్ని సాధించడానికి దోహదపడతాయని నేను ఆశిస్తున్నాను” అని అన్నారు.
Putin | ఆకట్టుకున్న మోదీ, పుతిన్..
షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ (PM Modi), పుతిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాలా రోజుల తర్వాత కలిసిన ఇద్దరు నేతలు ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుని హత్తుకున్నారు. అనంతరం సదస్సుకు ఒకే కారులో కలిసి వచ్చారు. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని పంచుకుంటూ మోదీ ‘ఎక్స్’లో ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. “SCO శిఖరాగ్ర సమావేశ వేదిక వద్ద కార్యకలాపాల తర్వాత అధ్యక్షుడు పుతిన్, నేను కలిసి మా ద్వైపాక్షిక సమావేశ వేదికకు ప్రయాణించాం. ఆయనతో చర్చలు ఎల్లప్పుడూ అంతర్దృష్టిని కలిగి ఉంటాయి” అని పేర్కొన్నారు.