అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kamareddy | కామారెడ్డి జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ భారం, భవిష్యత్తుపై ఆందోళన ఓ యువకుడి జీవితంలో అతి దారుణమైన నిర్ణయం తీసుకునేందుకు దోహదం చేసింది. భార్య, పిల్లల బాధ్యతలను మోయలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బీర్కూర్ మండలం (Beerkur Mandal) వీరాపూర్ దుబ్బాకు చెందిన ప్రహ్లాద్ (30) రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన సౌందర్యతో వివాహం జరిగింది. వీరికి స్నేహ (8), హర్షిత (6), వసుంధర (4) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం సౌందర్య తొమ్మిది నెలల గర్భిణి కాగా, జనవరి చివరిలో ప్రసవం జరగనుంది.
Kamareddy | భారం మోయలేక…
అయితే కుటుంబ పరిస్థితి, పిల్లల చదువు, భవిష్యత్తులో వివాహాల ఖర్చులపై ప్రహ్లాద్ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నాలుగో సంతానం కూడా ఆడపిల్లే పుడుతుందనే భయంతో శనివారం మధ్యాహ్నం అతడు కుటుంబ సభ్యుల సమక్షంలోనే విషం సేవించాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి, పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ (Nizamabad)కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ప్రహ్లాద్ మృతి చెందాడు. ఆదివారం శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గతంలో కూడా ప్రహ్లాద్ మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడని, అప్పట్లో కుటుంబ సభ్యులు అతడిని కాపాడినట్టు తెలిపారు.
ఈ ఘటన మరోసారి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ, ఆర్థిక ఒత్తిళ్లు ఎంతటి తీవ్ర ప్రభావం చూపుతున్నాయో చూపిస్తోంది. మానసిక ఆరోగ్యంపై అవగాహన, సహాయక వ్యవస్థలు ఎంత అవసరమో ఈ విషాదం గుర్తు చేస్తోంది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.