అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hero Prabhas | కమెడియన్, యాక్టర్ ఫిష్ వెంకట్ కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రి (RBM Hospital)లో వెంకట్‌కి చికిత్స అందిస్తున్నారు. అయితే అతనికి తప్పనిసరిగా కిడ్నీ మార్పిడి (Kidney Transplant) చేయాలని వైద్యులు తెలియజేశారట. అయితే ఆపరేషన్‌కు రూ.50 లక్షల వరకూ ఖర్చవుతుందని ఎవరైనా దాతలు సాయం చేయాలని ఆయన కుమార్తె స్రవంతి వేడుకున్నారు. ఇదే సమయంలో ప్రభాస్ అసిస్టెంట్ నుండి కాల్ వచ్చిందని, ఆపరేషన్‌కు కావాల్సిన ఆర్థిక సాయం అందిస్తామని చెప్పినట్లు తెగ ప్రచారాలు నడిచాయి. ఇప్పుడు అవన్నీ అవాస్తవాలే అని తేలింది.
Hero Prabhas | అవన్నీ అవాస్తవాలు..
తమ టీమ్ నుండి ఎవరు కూడా ఫిష్ వెంకట్(Fish Venkat)కి కాల్ చేయలేదని, ఏది ఉన్నా కూడా మీడియా ద్వారా తెలియజేస్తామని వారు వివరణ ఇవ్వడంతో పుకార్లకు చెక్ పడింది. గతంలో కూడా ప్రభాస్ (Hero Prabhas) వంద కోట్లు ఇచ్చారంటూ వార్తలు రాగా, టీమ్ వాటిని ఖండించింది. ఇక ఫిష్ వెంకట్ ఇప్పుడు వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. చాలా ఏళ్ల క్రితమే తన తండ్రి రెండు కిడ్నీలు పాడైపోగా, దాదాపు నాలుగేళ్ల నుంచి డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణాలు కాపాడుకుంటున్నారని తన కూతురు చెప్పుకొచ్చింది. ఇప్పుడు పరిస్థితి మరింత విషమంగా మారగా, ఇప్పుడు కనీసం ఒక కిడ్నీ అయినా మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని స్రవంతి పేర్కొంది.
ఆపరేషన్‌కు రూ.50 లక్షల వరకూ ఖర్చవుతుందని.. దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయగలరు అంటూ వెంకట్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నేను ఇవ్వాలని అనుకున్నా నా రక్తం గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో డాక్టర్స్ రిజెక్ట్ చేశారు. తమ్ముడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా ఆయనకు అనారోగ్య సమస్యలు ఉండడంతో కుదరలేదు. దాతలు ఎవరైనా ఉన్నారేమోనని డోనర్ సంస్థలను సంప్రదిస్తున్నామని వెంకట్ కూతురు పేర్కొంది. ఫిష్ వెంకట్ విలన్, హాస్య పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. గబ్బర్ సింగ్, బన్నీ, దిల్, నాయక్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు, అదుర్స్, ఢీ, మిరపకాయ్ వంటి చిత్రాలతో మనోడికి మంచి పేరు వచ్చింది.