అక్షరటుడే, వెబ్‌డెస్క్: Register Post | పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్ పోస్ట్ సేవలను నిలిపి వేయనున్నట్లు ప్రకటించింది. తపాలా శాఖ కాలంలో పాటు మారుతూ అనేక కొత్త విధానాలను ప్రవేశ పెట్టింది. గతంలో ఉత్తరాల బట్వాడాకు మాత్రమే పరిమితమైన శాఖ ప్రస్తుతం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని అనేక రకాల సేవలను అందిస్తోంది. ఇందులో భాగంగా తనకు భారంగా మారిన కొన్ని సేవలను తొలగిస్తుంది. తాజాగా రిజిస్టర్ పోస్ట్ సేవలను (Registered Post Services) నిలిపి వేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది.
Register Post | బ్రిటీష్ కాలంలో ప్రారంభం
పోస్టల్ శాఖ(Postal Department)లో రిజిస్టర్ పోస్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. 1854లో బ్రిటిష్ పాలన సమయంలో భారత్‌లో పోస్ట్ ఆఫీస్ చట్టాన్ని అమలు చేశారు. అప్పటి నుంచి రిజిస్టర్ పోస్ట్ సేవలు ప్రారంభం అయ్యాయి. 171 ఏళ్లుగా ఎంతో మంది ప్రజలు రిజిస్టర్ పోస్టు ద్వారా తమకు కావాల్సిన వారికి ఎన్నో ఉత్తరాలు, వస్తువులు పంపించారు. అయితే ఈ సేవలు ఇక కనుమరుగు కానున్నాయి.
మాములు పోస్టుతో పోలిస్తే రిజిస్టర్ పోస్ట్(Register Post) ఖరీదైనది. ముఖ్యమైన పత్రాలు, లేఖలు, వస్తువులు పంపడానికి రిజిస్టర్ పోస్టులు ఉపయోగిస్తారు. రిజిస్టర్ పోస్టుకు ట్రాకింగ్ సౌకర్యం ఉంటుంది. అంతేగాకుండా సంబందిత పోస్టును రీసివ్ చేసుకున్న వారు సంతకం చేయాల్సి ఉంటుంది. లీగల్ నోటీసులు, బ్యాంకింగ్ సంబంధిత పత్రాలు, అపాయింట్‌మెంట్ లెటర్లు రిజిస్టర్ పోస్టు ద్వారా పంపేవారు.
Register Post | స్పీడ్ పోస్ట్‌లో విలీనం
ప్రస్తుతం పోస్టల్ శాఖ స్పీడ్ పోస్టు సేవలను(Speed Post Services) అందిస్తోంది. ఇక రిజిస్టర్ పోస్టు సేవలను కూడా అందులోనే విలీనం చేయాలని నిర్ణయించింది. రిజిస్టర్ పోస్టు ఖరీదు స్పీడ్ పోస్టు కంటే తక్కువగా ఉంటుంది. అలాగే డెలివరీ కావడానికి ఎక్కువ సమయం పట్టేది. పోస్టల్ శాఖ రిజిస్టర్డ్ పోస్టులను స్పీడ్ పోస్ట్ సర్వీస్‌లో కలపాలని ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు పోస్టల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. స్పీడ్ పోస్ట్‌తో వస్తువులను వేగంగా పంపించవచ్చు. సదరు పార్సిల్ ఎక్కడి వరకు వెళ్లిందో.. ఆన్లైన్లో ట్రాక్ చేయవచ్చు. రిజిస్టర్డ్ పోస్ట్‌లో ఈ సౌకర్యం లేదు. రిజిస్టర్ పోస్టు కనీస ఛార్జి ప్రస్తుతం రూ.25 ఉంది. స్పీడ్ పోస్టుకు అయితే రూ.36గా ఉంది. సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్ సేవలు నిలిచిపోనుండడంతో వినియోగదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది.