అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pre Market Analysis : గ్లోబల్ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో యూఎస్, యూరోప్ మార్కెట్లు పాజిటివ్‌గా క్లోజ్ అవగా.. గురువారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు సైతం లాభాలతో కొనసాగుతున్నాయి.
Pre Market Analysis : యూఎస్ మార్కెట్లు..
వివిధ దేశాలతో యూఎస్(US) కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో వాల్‌స్ట్రీట్(Wallstreet) ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు చేసుకుంటూ పైపైకి వెళ్తోంది. బుధవారం ఎస్‌అండ్‌పీ 0.78 శాతం పెరగ్గా… నాస్‌డాక్(Nasdaq) 0.61 శాతం లాభాలతో ముగిసింది. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 0.14 శాతం నష్టంతో కొనసాగుతోంది.
Pre Market Analysis : యూరోప్ మార్కెట్లు..
ఈయూ, యూఎస్‌ల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశావాదంతో యూరోప్(Europe) మార్కెట్లు సైతం ర్యాలీ తీశాయి. సీఏసీ 1.35 శాతం పెరగ్గా.. డీఏఎక్స్ 0.82 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.42 శాతం లాభాలతో ముగిశాయి.
Pre Market Analysis : ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా(Asia) మార్కెట్లు గురువారం ఉదయం ఎక్కువగా స్వల్ప లాభాలతో ఉన్నాయి. ఉదయం 8 గంటల సమయంలో నిక్కీ(Nikkei) 1.90 శాతం, కోస్పీ 0.93 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.44 శాతం, షాంఘై 0.35 శాతం, హంగ్‌సెంగ్ 0.34 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.26 శాతం లాభంతో ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లనుంచి వస్తున్న సానుకూల సంకేతాల నడుమ మన మార్కెట్లు సైతం పాజిటివ్‌గా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) 0.19 శాతం లాభంతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pre Market Analysis : గమనించాల్సిన అంశాలు..
ఎఫ్‌ఐఐలు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. నికరంగా రూ. 4,209 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐలు వరుసగా 13వ ట్రేడింగ్ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులు(Net buyers)గా కొనసాగారు. నికరంగా రూ. 4,358 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.44 నుంచి 1.14 కు పెరిగింది. ఇది మార్కెట్‌లో బుల్లిష్ సెంటిమెంట్‌ను సూచిస్తోంది.
- విక్స్(VIX) 2.21 శాతం తగ్గి 10.52కు పడిపోయింది. ఇది గతేడాది ఏప్రిల్ 24 తర్వాత అత్యల్ప స్థాయి. విక్స్ తక్కువగా ఉండడం ఇన్వెస్టర్లలో భయలేమికి నిదర్శనం.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 68.67 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు బలహీనపడి 86.41 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 0.05 శాతం పెరిగి 4.39 వద్ద, డాలర్ ఇండెక్స్ 0.05 శాతం బలహీనపడి 97.15 వద్ద కొనసాగుతున్నాయి.
- యూఎస్‌లో హోమ్‌సేల్స్ అంచనాలకన్నా ఎక్కువగా పడిపోయాయి. గత నెలలో ఇళ్ల అమ్మకాలు 2.7 శాతం తగ్గాయి.
- యూఎస్‌తో వివిధ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదురుతుండడంతో ముడి చమురు ధరలు నిలకడగా ఉంటున్నాయి.