అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Congress | కాంగ్రెస్‌లో పదవుల సందడి మొదలు కానుంది. పార్టీలో సంస్థగత పదవుల భర్తీ కోసం చాలా మంది నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో వాటి భర్తీకి అధిష్టానం చర్యలు చేపట్టింది.
కాంగ్రెస్‌లో డీసీసీ (DCC)ల నియామకం, నామినేటేడ్ పోస్టుల కోసం చాలా రోజులుగా ద్వితీయ శ్రేణి నాయకులు ఎదురుచూస్తున్నారు. పార్టీ సంస్థగత నిర్మాణంలో భాగంగా పదవులను భర్తీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ (Mahesh Goud) భావించారు. ఈ మేరకు వారు పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన సమయంలో దీని గురించి అధిష్టానంతో చర్చించారు. ఈ క్రమంలో తాజాగా డీసీసీ నియామకాల ప్రక్రియ ప్రారంభించడానికి పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.
Congress | రాష్ట్రానికి ఏఐసీసీ పరిశీలకులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తుంది. అయితే ఇప్పటికి జిల్లా కమిటీలను మళ్లీ నియమించలేదు. గతంలోని డీసీసీలే కొనసాగుతున్నాయి. స్థానిక ఎన్నికల వేళ పదవులు భర్తీ చేయాలని పార్టీ యోచిస్తోంది. రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం ఏఐసీసీ 22 మంది పరిశీలకులను నియమించింది. వారు శనివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి వారం రోజుల్లో సమగ్ర నివేదికను ఏఐసీసీకి అందజేస్తారు. అనంతరం జిల్లా అధ్యక్షులతో పాటు డీసీసీలను కాంగ్రెస్ అధినాయకత్వం నియమించనుంది.
Congress | స్థానిక ఎన్నికల వేళ..
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు (Local Body Elections) త్వరలో జరగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడగా.. హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో పదవులను నియమించనుంది. పార్టీ కోసం ఏళ్లుగా పని చేసిన వారికి పదవుల్లో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. అయితే స్థానిక ఎన్నికలు అయిపోయాక పదవులు ఇస్తారా.. లేక ముందే ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. ముందే డీసీసీలను నియమిస్తే పదవి దక్కని వారు అలిగే అవకాశం ఉంది. దీంతో స్థానిక ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చు. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక పదవులు భర్తీ చేస్తే.. టికెట్లు రాని వారిని సైతం పార్టీ పదవి ఇచ్చి బుజ్జగించే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. అయితే పైరవీలకు తావులేకుండా పార్టీ కోసం పని చేసే సమర్థులకు పదవులు ఇవ్వడానికే హైకమాండ్ అబ్జర్వర్లను నియమించినట్లు నాయకులు చెబుతున్నారు.