portugal-beach
Roll Cloud | వైర‌ల్ వీడియో.. బీచ్‌లో వింత మేఘాన్ని చూసి భ‌య‌ప‌డ్డ ప్ర‌జ‌లు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Portugal | ఇటీవ‌ల వాతావ‌ర‌ణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని వింత‌లు ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. తాజాగా పోర్చుగల్‌లోని పోవోవా డో వర్జిమ్ బీచ్‌(Povoa do Verjim Beach)లో ఓ అరుదైన వాతావరణ ఘటన సందర్శకుల‌కు భయాందోళన కలిగించింది. సముద్రపు కెరటం లానే కనిపించే ఓ భారీ మేఘం ఆకాశంలో పైపు ఆకారంలో తీరం వైపు వేగంగా కదులుతూ వచ్చింది. ఈ అద్భుత దృశ్యాన్ని ‘రోల్ క్లౌడ్’(Roll Cloud) అంటారు. రోల్ క్లౌడ్ సమీపానికి వచ్చేసరికి బీచ్‌పై బలమైన గాలులు వీశాయి. దీంతో అక్కడున్న గొడుగులు, చిన్నచిన్న వస్తువులు ఎగిరిపోయాయి.

Roll Cloud | ఇదేం వింత?

పర్యాటకులు(Tourists) ఒక్కసారిగా షాక్‌కు గురై పరుగులు పెట్టారు. కొంతమంది స్థానికులు ఈ దృశ్యాన్ని ఫోన్‌లలో బంధించగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాతావరణ నిపుణుల వివరాల ప్రకారం, రోల్ క్లౌడ్ అంటే ఏంటి అంటే.. ఇది చాలా అరుదుగా కనిపించే వాతావరణ(Climate) మార్పు. ఇది సాధారణంగా వేడి గాలులు మరియు చల్లటి గాలులు పరస్పర ప్రభావంతో ఏర్పడుతుంది. ఇవి భూమికి సమాంతరంగా, పైపు మాదిరిగా చలనం కలిగి ఉండడం విశేషం. ఇవి భారీగా కనిపించినా సునామీ(Tsunami)తో ఎలాంటి సంబంధం ఉండదు.

ప్రస్తుతం పోర్చుగల్‌(Portugal)లో తీవ్రమైన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు విస్తరిస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన అస్థిర పరిస్థితులే ఈ రోల్ క్లౌడ్‌కు కారణమని ‘యూరోన్యూస్’(Euronews) నివేదిక పేర్కొంది. దీంతో పాటు, వడగాలులతో అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు ప్రమాదం పెరిగిందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుండగా, పర్యాటకులు ప్రత్యక్షంగా చూసిన ఈ వింత వాతావరణాన్ని జీవితంలో మరిచిపోలేనని చెబుతున్నారు.