అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Chandra Babu | ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్స్ రంగంలో దేశానికి మార్గదర్శకంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖపట్నం(Visakhapatnam)లోని నోవాటెల్‌లో జరిగిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు(CM Chandra Babu) మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండేలా చర్యలు తీసుకుంటాం. దీని ద్వారా ఏపీని మారిటైమ్ లాజిస్టిక్స్ హబ్‌గా మార్చేందుకు తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం” అని తెలిపారు.
CM Chandra Babu | ఏపీకి ఉన్న ప్రత్యేక అనుకూలతలు
చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీకి ఉన్న సుదీర్ఘ తీరరేఖ, మంచి రైల్వే కనెక్టివిటీ, అభివృద్ధి చెందుతున్న రహదారి మౌలిక వసతులు లాంటి అంశాలు పారిశ్రామికీకరణకు దోహదంగా మారతాయని పేర్కొన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో ఏపీ కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను ప్రస్తావించిన సీఎం, “రాబోయే రోజుల్లో రోడ్లు, రైళ్లు, సముద్ర రవాణా గణనీయంగా పెరుగుతుంది. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కూడా పెద్దపీట వేస్తాం” అని చెప్పారు. అమరావతి(Amaravathi)ని క్వాంటం కంప్యూటింగ్‌కు తలమానికంగా అభివృద్ధి చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న లాజిస్టిక్స్ కంపెనీల ప్రతినిధులు ఎయిర్ కార్గో వసతులు పెంచాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందనగా సీఎం చంద్రబాబు ఎయిర్ కార్గో ఫోరం ఇండియా(Air Cargo Forum India) యొక్క కొత్త లోగోను ఆవిష్కరించారు.అంతకుముందు సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. అమరావతి అభివృద్ధికి ఇది కీలకంగా మారనుంది. ఈ నిర్ణయాలతో ఏపీ అభివృద్ధి పథంలో మరింత వేగంగా ముందుకు సాగనుందని పరిశ్రమల వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.