అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Poonam Kaur | ఒకప్పుడు హీరోయిన్గా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి పూనమ్ కౌర్ గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభ దశలో హీరోయిన్గా రాణించిన పూనమ్, ఆ తర్వాత సహాయక పాత్రల్లో నటించి, అనూహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. అయితే సినిమాల్లో కనిపించకపోయినా, వివాదాస్పద వ్యాఖ్యలు, ఇంటర్వ్యూల ద్వారా ఆమె తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్ కౌర్, తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, ఎదుర్కొన్న కఠిన అనుభవాలపై ఓపెన్‌గా మాట్లాడారు. ప్రస్తుతం తాను సినిమాలకు దూరంగా ఉండి, హోమ్మేకర్గా జీవిస్తూ సామాజిక సేవ చేయాలనుకుంటున్నానని తెలిపారు. అయితే తన ఆశయాలను కొందరు అపహాస్యం చేయడం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు.
Poonam Kaur | అల్లు అర్జున్ సినిమా అవకాశాన్ని వదులుకున్నా..
సోషల్ మీడియా (Social Media)లో తనపై వచ్చిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్న పూనమ్, “నువ్వు చనిపోతే ఒక రోజు వార్తగా మాత్రమే మిగులుతావు” అంటూ చేసిన కామెంట్స్ తనను తీవ్రంగా కలచివేశాయని చెప్పారు. అయినప్పటికీ, తన ప్రిన్సిపల్స్ విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని స్పష్టం చేశారు. తన కెరీర్ ప్రారంభంలోనే అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా అవకాశం వచ్చినా, దర్శకుడు తేజకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆ అవకాశాన్ని వదిలుకున్నానని పూనమ్ వెల్లడించారు. పదో తరగతిలోనే మొదటిసారి కెమెరా ముందుకు వచ్చానని, ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎవరినీ అడగలేదని, కేవలం ఆడిషన్స్ ద్వారానే అవకాశాలు పొందానని చెప్పారు.
కొంతమంది దర్శకులు “మీరు ఈ ఇండస్ట్రీకి సరిపోరు” అని చెప్పిన సందర్భాలున్నాయని, అయినప్పటికీ కాలేజ్ ఫీజు కోసం నటన చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తన తండ్రి చిన్న వయసులోనే మరణించారని, ఒక కళాకారుడిని రక్షించబోయే క్రమంలో జరిగిన ప్రమాదమే ఆయన మరణానికి కారణమని పూనమ్ భావోద్వేగంగా చెప్పారు. తనకు పెళ్లి, పిల్లలపై ఆశలు ఉన్నాయని, కానీ “నువ్వు ఇక్కడ సెట్ అవ్వవు” వంటి మాటలు ఎన్నోసార్లు వినాల్సి వచ్చిందని తెలిపారు. తన కారణంగానే తల్లి రెండోసారి కన్నీళ్లు పెట్టుకుందని చెప్పిన పూనమ్, ఫోటోలు దిగడానికే ఇష్టపడని కుటుంబం నుంచి సినీ పరిశ్రమలోకి రావడం చిన్న విషయం కాదని అన్నారు. తనను సరైన హౌస్‌వైఫ్ మెటీరియల్‌గా వర్ణించడాన్ని అంగీకరిస్తూనే, సినీ పరిశ్రమ (Film Industry)లోని పరిస్థితులకు తాను పూర్తిగా సరిపోలేకపోయానని పూనమ్ కౌర్ తెలిపారు. సమాజంలో అందం ఒక శాపంగా మారిందని, ముఖ్యంగా మహిళల విషయంలో ఇది మరింత నిజమని వ్యాఖ్యానించారు.