అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ponguleti Seeks 5 Lakh Houses | రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ (Union Minister Shivraj Singh Chouhan)ను కలిసి వినతి పత్రం అందించారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses)నిర్మాణం చేపడుతోందని మంత్రి తెలిపారు. ఈ పథకానికి సహకారం అందించాలని, రాష్ట్రానికి రావాల్సిన ఇండ్లను మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌కు విచ్చేసిన కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పొంగులేటి వినతి పత్రాన్ని అందజేశారు.
Ponguleti Seeks 5 Lakh Houses | గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో..
పేదల సంక్షేమాన్ని విస్మరించిన ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలల్లో కేంద్రం నుంచి ఒక ఇల్లు కూడా తీసుకోలేదని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీఎంఏవై-జీలో రాష్ట్రం అధికారికంగా చేరిందన్నారు. గత 12 ఏళ్లలో పెరిగిన డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది 3 లక్షల ఇళ్లు, వచ్చే ఏడాది మరో 2 లక్షల ఇండ్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహించి లబ్ధిదారుల డేటాబేస్‌ను ఇప్పటికే సిద్ధం చేసిందన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆవాస్+2024 మొబైల్ యాప్ ద్వారా మరోసారి సర్వే నిర్వహించి మొత్తం 11.57 లక్షల అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించినట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (Prime Minister’s Housing Scheme) పథకంలో కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం ఇందిరమ్మ పథకానికి వినియోగిస్తోంది. త్వరలో రెండోదశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి ఇళ్లు మంజూరు చేయాలని పొంగులేటి కోరారు.