అక్షరటుడే, హైదరాబాద్: MLC Kavitha future : ఇందూరు కోడలు, ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది.
గత కొంతకాలంగా పార్టీ ధిక్కార వ్యాఖ్యలు చేస్తున్నారన్న కారణంతో అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ BRS ప్రకటించింది.
కన్న తండ్రే ఆమెను సొంత పార్టీ నుంచి పంపించేశారు. కవితకు రాజకీయంగా ఎక్కువగా పట్టున్నది నిజామాబాద్ జిల్లాలోనే.
పుట్టినిల్లు నుంచి వెళ్లగొట్టిన నేపథ్యంలో.. మెట్టినిల్లు అయిన ఉమ్మడి నిజామాబాద్ Nizamabad జిల్లాలోనూ ఆమెకు మద్దతు కరవైనట్లు కనిపిస్తోంది.
కీలక నేతలంతా భారాస పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి ప్రకటనలు చేస్తుండటం కల్వకుంట్ల కవిత అనుచరులను గందరగోళంలో పడేస్తోంది.
MLC Kavitha future : ఇందూరు కేంద్రంగానే రాజకీయాలు..
ఎమ్మెల్సీ కవిత రాజకీయ ప్రస్థానం అంతా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంగానే సాగింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించినప్పటికీ, రాజకీయంగా మాత్రం ఇందూరు జిల్లాకే పరిమితమయ్యారు.
బలమైన మద్దతుదారులు కూడా ఈ జిల్లా నుంచే ఉన్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచే ఎంపీగా ఎన్నికయ్యారు.
అయితే, 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దీంతో కేసీఆర్ ఆమెను ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బరిలోకి దింపి గెలిపించారు.
MLC Kavitha future : బాస్ వెంటే నేతలంతా..
కాగా, గత కొంతకాలంగా కవిత వైఖరి బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారింది. పార్టీ రజతోత్సవ సభపై అభిప్రాయాలు తెలుపుతూ తన తండ్రికి రాసిన లేఖ బయటకు రావడంతో ఆమె పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని, వారే పార్టీని నాశనం చేస్తున్నారని, తనపై కుట్ర పన్ని ఎంపీ ఎన్నికల్లో ఓడించారని ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యేలే తనను ఓడగొట్టారని కూడా చెప్పారు.
తాజాగా హరీశ్ రావు Harish Rao, సంతోష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో కవితకు మెట్టినిల్లు అయిన నిజామాబాద్ జిల్లా నుంచి ఆమె వెంట ఎవరు నడుస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే, ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలు కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు.
మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్ ఈ మేరకు ప్రకటనలు కూడా చేశారు.
ఇక, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి లాంటి వారు ఎప్పటి నుంచో కేసీఆర్ నమ్మిన బంటుల్లా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కవిత Kavitha మద్దతు దొరకడం కష్టంగానే కనిపిస్తోంది.