అక్షరటుడే, వెబ్డెస్క్ : Panchayat Elections | పల్లెలు ఓటెత్తాయి.. పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడాయి.. స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికలు బుధవారం చెదురుమదురు ఘటనలు మినహాగా ప్రశాంతంగా ముగాశాయి. చలిని కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు.
మధ్యాహ్నం ఒంటి ఓటింగ్ ముగిసే సమయం వరకూ పోలింగ్ కేంద్రాలు సందడిగా కనిపించాయి. జనం పోటెత్తడంతో భారీగా పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతానికిపైగా ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. తొలి రెండు విడతల్లో కనిపించిన కాంగ్రెస్ హవా చివరి విడతలోనూ కనిపించింది.
Panchayat Elections | భారీగా పోలింగ్..
పల్లె పోరులో భాగంగా మూడో విడత ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. చివరి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లోని 4,159 పంచాయతీలు, 36,452 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, 394 జీపీలు ఏకగ్రీవం కాగా, 11 చోట్ల నామినేషన్లు రాలేదు. మిగిలిన 3,752 పంచాయతీల్లో బుధవారం ఎన్నికలు జరిగాయి. అలాగే, 7908 వార్డులు ఏకగ్రీవం కాగా, 116 చోట్ల నామినేషన్లు రాలేదు. మిగిలిన 28,410 వార్లుల్లో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించగా, ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
Panchayat Elections | పలుచోట్ల ఘర్షణలు..
పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) భాగంగా అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో అధికార, ప్రతిపక్ష శ్రేణులు ఘర్షణకు దిగాయి. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ నేత సాయి (Congress Party Leader Sai)పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ – బీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలోని కొత్తగూడ మండలం పొగుల్లపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ – కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఈర్యతో పాటు నాలుగురు కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు (BRS Leaders) దాడి చేశారు. ఈ క్రమంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా టేకులపల్లి పరిధిలోని తండాలో అధికార, ప్రతిపక్ష కార్యకర్తలు దాడులకు దిగారు. దొంగ ఓటు వేసేందుకు యత్నిస్తున్నాడని సర్పంచ్ అభ్యర్థి ఓ వ్యక్తిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నల్లగొండ జిల్లా డిండి మండలం శాంతిగూడెంలోనూ ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు.
Panchayat Elections | ప్రశాంతంగా పంచాయతీ పోరు
రాష్ట్రంలో మూడు విడుతల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలోని మొత్తం 12 వేల పైచిలుకు పంచాయతీలు, లక్షకు పైగా వార్డు స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. డిసెంబర్11న తొలి విడత, 14వ తేదీన రెండో విడత పోలింగ్ నిర్వహించగా, 17న బుధవారం చివరి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. ఈసారి పెద్దగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు పూర్తి కావడంతో అటు ప్రభుత్వం, ఇటు అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. తొలి రెండు విడతల్లోనూ కాంగ్రెస్ పార్టీ (Congress Party) మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంది. మూడో విడతలోనూ అదే పరిస్థితి కనిపించింది.