అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Exit Polls | జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ (Polling) సాగింది. 6 గంటల వరకు క్యూలైన్లో ఉన్న వారికి సైతం ఓటు వేసే అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం పోలింగ్ నమోదు అయింది. ఎన్నికలు ముగియడంతో ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయింది. ఈ నెల 14న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఆ రోజు విజేత ఎవరో తేలనుంది. అయితే కాంగ్రెస్‌దే విజయం అని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.
జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ స్థానం బీఆర్ఎస్ గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. అన్ని పార్టీలు ఈ స్థానంలో గెలవాలని అనేక ప్రయత్నాలు చేశాయి. కీలక నేతలు నియోజకవర్గంలో ప్రచారం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. చాణక్య సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 46 శాతం, బీఆర్ఎస్కు 41 శాతం, బీజేపీ 6 శాతం ఓట్లు వస్తాయి. పీపుల్స్ పల్స్ ప్రకారం.. కాంగ్రెస్ 48 శాతం, బీఆర్ఎస్ 41 శాతం ఓట్లు సాధిస్తాయి. స్మార్ట్ పోల్, నాగన్న సర్వే సైతం కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి.
Exit Polls | హోరాహోరీగా ప్రచారం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు అన్ని పార్టీలకు కీలకం. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ (Congress) ఈ స్థానాన్ని గెలుచుకుంటే స్థానిక ఎన్నికల్లో లాభం చేకూరుతుంది. ఒకవేళ ఓడిపోతే ఈ రెండేళ్ల పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని భావించాల్సి ఉంటుంది. దీంతో ఈ ఎన్నికలను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారం చేశారు. ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయో లేదో ఈ నెల 14న తేలనుంది.