అక్షరటుడే, కామారెడ్డి/బోధన్: Panchayat elections | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు (Panchayat elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే చలి కారణంగా ఓటర్లు నుంచి బయటకు వెళ్లడం లేదు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 9 గంటల వరకు అంతంత మాత్రమే కొనసాగినట్టుగా తెలుస్తోంది.
ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఇళ్లలో పనులన్నీ పూర్తి చేసుకుని ఎండ రావడంతో తీరిగ్గా ఓటు వేయడానికి క్యూ కడుతున్నారు. మరోవైపు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అభ్యర్థులు అనేక పాట్లు పడుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ జరగనుండడంతో వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు (polling stations) తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అభ్యర్థులకు సంబంధించిన అనుచరులు ఓటర్లను త్వరగా వెళ్లి ఓటు వేయాలని కోరుతున్నారు.
Panchayat elections | నిజామాబాద్ జిల్లాలో..

నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లో (Bodhan division) తొలివిడత ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 155 సర్పంచ్ స్థానాలు, 1060 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. ఇందుకోసం 1457 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
Panchayat elections | కామారెడ్డి జిల్లాలో
కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) మొదటి విడత ఎన్నికలు బీబీపేట, బిక్కనూర్, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాలలో జరుగుతున్నాయి. 156 సర్పంచ్ స్థానాలలో (Sarpanch seats) 1084 వార్డు స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. కాగా.. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Panchayat elections | 19.70 శాతం ఓటింగ్ నమోదు
కామారెడ్డి జిల్లాలో మొదటి విడత జరుగుతున్న 10 మండలాలలో ఉదయం 9 గంటల వరకు 19.70 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 2,42913 మంది ఓటర్లు ఉండగా 9 గంటల వరకు 47850 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. భిక్కనూరు మండలంలో 21.22 శాతం, బీబీపేటలో 7.36, దోమకొండ 19.14, కామారెడ్డి 23.68, మాచారెడ్డి 19.46, పాల్వంచ 20.49, రాజంపేట 21.02, రామారెడ్డి 22.61, సదాశివనగర్ 20.96, తాడ్వాయి మండలంలో 18.76 శాతం పోలింగ్ నమోదైంది. కామారెడ్డి మండలంలో అత్యధికంగా 23.68 శాతం ఓటింగ్ నమోదు కాగా అత్యల్పంగా బీబీపేట మండలంలో 7.36 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.
