అక్షరటుడే, వెబ్డెస్క్: MLC Kavitha | రాష్ట్ర రాజకీయాలు కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత చుట్టూ తిరుగుతున్నాయి. ఎప్పుడైతే ఆమె తన తండ్రి కేసీఆర్(KCR)కు రాసిన లేఖ బయటకు వచ్చిందో అప్పటి నుంచి రాజకీయాలు వేడెక్కాయి.
తరచూ ప్రెస్ మీట్లు, చిట్ చాట్లలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపాయి. భారీ వరదలు, కాళేశ్వరం కమిషన్ నివేదిక (Kaleshwaram Commission report), అసెంబ్లీలో చర్చ, సీబీఐ విచారణకు (CBI investigation) ఆదేశం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ రాష్ట్ర రాజకీయాలతో పాటు మీడియా ఫోకస్ అంతా కవిత మీదనే కేంద్రీకృతమైంది.
MLC Kavitha | కేంద్ర బిందువుగా మారిన కవిత..
ఎప్పుడైతే కవిత బహిరంగంగా బీఆర్ఎస్(BRS)లోని కొందరు నేతలను టార్గెట్ చేశారో అప్పటినుంచే రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు. ఉద్యమ పార్టీగా పాతికేళ్ల ప్రస్థానం, ప్రభుత్వంలో పదేళ్ల పాటు ప్రయాణం.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన గులాబీ పార్టీలో కవిత రేపిన కల్లోలం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె రాసిన లేఖ నుంచి మొదలు ఇప్పుడు అడుగులు ఎటు వేస్తారనే వరకూ మీడియాతో పాటు రాజకీయ వర్గాల దృష్టి అంతా ఆమె మీదే నెలకొంది.
ఈ తరుణంలో కవిత చర్యలు రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పేలా ఉన్నాయి. ఆమె తీసుకునే నిర్ణయాలు ఎవరి పుట్టి ముంచనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసినా ప్రజల్లోనే ఉంటానంటున్న కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మిగిలిన రాజకీయ పక్షాల మీద ఎంతో కొంత ప్రభావం చూపుతుందన్నది సుస్పష్టం.
MLC Kavitha | ఆరోపణలు.. ప్రత్యారోపణలు..
కవిత ఎపిసోడ్ కేవలం బీఆర్ఎస్ వరకే పరిమితం కాలేదు. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) వంటి పార్టీల పాత్ర కూడా తెర పైకి వస్తోంది. కవిత వెనుక ఉన్నది మీరంటే మీరని ప్రధాన రాజకీయ పక్షాలు విమర్శిస్తుండడం కొత్త చర్చకు దారి తీస్తోంది. కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కవితను ఎగదోస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అదే సమయంలో బీజేపీ పాత్రపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని శక్తులు వెనుకుండి ఆమెను నడిపిస్తున్నాయని ఉద్యమ పార్టీ ఆరోపిస్తుంటే, మరోవైపు, ఇదంతా కేసీఆర్ ఆడుతున్న డ్రామాలో భాగమేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
కవిత రేపిన కల్లోలానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని (Congress Party) పల్లా రాజేశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వారు వ్యాఖ్యానించారు. ఇక, రెండు పార్టీల విమర్శలు, ప్రతివిమర్శల నడుమ బీజేపీ కూడా మధ్యలో దూరింది. కాళేశ్వరం పై ప్రజల దృష్టిని మళ్లించడానికే కవిత ఎపిసోడ్ ను తెరపైకి తెచ్చి కాంగ్రెస్, బీఆర్ ఎస్ కలిసి ఆడుతున్న డ్రామా అని అభివర్ణిస్తోంది. మొత్తంగా ప్రధాన పార్టీలన్నీ కవిత కేంద్రంగానే విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తుండడం గమనార్హం.