అక్షరటుడే, హైదరాబాద్: Political Rakhi | ఏటా శ్రావణ (Shravan) మాసంలో వచ్చే పున్నమిని రాఖీ పౌర్ణమిగా నిర్వహించుకుంటాం. సోదరుల క్షేమం కోరుతూ సోదరీమణులు రాఖీ కడుతుంటారు. విజయం కాంక్షిస్తూ నోరు తీపి చేస్తుంటారు.
రాఖీ (Rakhi) అంటే ‘రక్షణ’ (Raksha Bandhan). తమ తోడబుట్టిన వారికి ఎలాంటి అవాంతరాలు, ఆపదలు రాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కాంక్షిస్తూ ఆడపడుచులు తమ సోదరులకు రక్ష కడుతుంటారు.
ఈ రక్షనే రాఖీగా పేర్కొంటారు. తమ అభ్యున్నతి, శ్రేయస్సుని కోరుకునే సోదరీమణులకు ఈ పర్వదినం సందర్భంగా సోదరులు కానుకలిస్తుంటారు.
శనివారం (ఆగస్టు 9) రాఖీ పర్వదినం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ముఖ్యంగా రాజకీయ ప్రముఖుల ఇళ్లలో ఉదయం నుంచే సందడి కొనసాగింది.
తమ సోదరులు రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షిస్తూ.. సోదరీమణులు తమ రాజకీయ సోదరులకు రాఖీలు కట్టి, నోరు తీపి చేశారు. అన్న చేతుల మీదుగా కానుకలు అందుకున్నారు.
Political Rakhi | వేడుకకు దూరం..
కాగా, తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాఖీ వేడుకకు దూరంగా ఉన్నారు.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన ఈ రాఖీ పండగను తమ సోదరీమణులతో కేటీఆర్, జగన్నిర్వహించుకోలేదు.
ప్రస్తుతం ఈ అంశంపై అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. కేటీఆర్ సోదరీమణి ఎమ్మెల్సీ కవిత తన అన్నకు రాఖీ కట్టేందుకు సుముఖత చూపలేదా.. లేక ఆమెతో రాఖీ కట్టించుకోవడం ఇష్టం లేక కేటీఆర్ దూరంగా ఉన్నారా.. అనేది చర్చనీయాంశంగా మారింది.
కవిత గతేడాది సైతం కేటీఆర్కు రాఖీ కట్టలేకపోయారు. ఎందుకంటే లిక్కర్ కుంభకోణం కేసులో ఆమె జైలులో ఉండటంతో నాడు ఈ వేడుకకు దూరం అయ్యారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న రాజకీయ అనిశ్ఛితి వల్ల దూరం అయినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లో కేటీఆర్ లేనందున ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత ఆయనకు రాఖీ కట్టలేకపోయారని చెబుతున్నారు. కాగా, కేటీఆర్ కావాలనే అందుబాటులో ఉండకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది.
అంటే ఆయన తన సోదరి కవితకు దూరంగా ఉండాలని నిశ్ఛయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే రక్షాబంధన్ రోజున కేటీఆర్ తన సోదరి కవితకు అందుబాటులో లేకుండా పోయారని అంటున్నారు.
Political Rakhi | నాడు జైలులో ఉండటం వల్ల.. నేడు అందుబాటులో ఉన్నా..
రాఖీ కట్టేందుకు వస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత తన అన్న కేటీఆర్కు మెసేజ్ పంపినట్లు అంటున్నారు. కాగా, పార్టీ వర్క్ మీద ఢిల్లీ వెళ్తున్నట్లు ఆయన రిప్లై ఇచ్చినట్లు పేర్కొంటున్నారు.
గతేడాది రాఖీ పండగ సమయంలో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉండిపోయారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు కావడంతో కేటీఆర్కు రాఖీ కట్టలేకపోయారు. అప్పట్లో కేటీఆర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తన వేదనను వెలిబుచ్చారు. అందరి నుంచి సానుభూతి పొందారు.
కాగా, ఈసారి కవిత అందుబాటులో ఉన్నా కూడా రాఖీ కట్టించుకోకుండా కేటీఆర్ ఔట్ ఆఫ్ స్టేషన్ అని రిప్లై ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటో బహిరంగ రహస్యమే. అన్నాచెల్లెళ్ల మధ్య బంధం తెగినట్లు స్పష్టం అవుతోంది.
Political Rakhi | షర్మిల దూరం..
ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం వైఎస్ జగన్ పరిస్థితి సైతం ఇలాగే ఉంది. జగన్కు ఆయన సోదరి వైఎస్ షర్మిలకు మధ్య అగాధం నెలకొంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్కు షర్మిల రాఖీ కట్టలేదని ప్రచారంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్లో అధికారానికి దూరమయ్యాక వైఎస్ జగన్ ఎక్కువగా బెంగుళూరులో ఉండిపోతున్నారు. పార్టీ సమావేశాలకు మాత్రమే అమరావతికి వచ్చి వెళ్తున్నారు. ఇక వైఎస్ జగన్కు, షర్మిలకు మధ్య సంబంధాలు దాదాపు పూర్తిగా తగ్గిపోయినట్లే తెలుస్తోంది. అందుకే రాఖీ పర్వదినాన కూడా ఈ అన్నాచెల్లెళ్లు ఎడముఖం పెడముఖం అన్నచందంగా ఉన్నారని ప్రచారంలో ఉంది.