అక్షరటుడే, వెబ్‌డెస్క్: Land encroachment | నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్లో ప్రభుత్వ స్థలం కబ్జా వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీని వెనుక ఓ ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా.. కబ్జాకు పాల్పడిన స్థలం విలువ రూ. 15 కోట్ల పైచిలుకు ఉండడం గమనార్హం.
నగర శివారులోని ముబారక్ నగర్ పెద్దమ్మతల్లి ఆలయం సమీపంలో గతంలో ఏకశిలా నగర్ పేరిట కొందరు వెంచర్‌ను డెవలప్ చేశారు. ఈ క్రమంలో జీపీ నిబంధనల ప్రకారం పది శాతం స్థలాన్ని వదిలేశారు. తదనంతరం గ్రామ పంచాయతీకి అప్పగించారు. కాలక్రమేణ ఈ జీపీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం కావడం, రికార్డులు గల్లంతవడం భూ అక్రమార్కుల పాలిట వరంగా మారింది. దీనిని అదునుగా చేసుకుని ఓ ఉద్యోగ సంఘం నేత, మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి కలిసి సదరు పది శాతం స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సదరు స్థలాన్ని చదును చేసి తిరిగి అమ్మకాలు మొదలు పెట్టారు.
Land encroachment | పెద్దల అండదండలు
నిజామాబాద్ నగర శివార్లలోని ఏ ప్రాంతంలో చూసినా భూముల ధరలు రూ. ఎకరం కోట్లలో పలుకుతున్నాయి. ముబారక్ నగర్ ప్రాంతంలో గజం రూ. 10వేలు పైబడి పలుకుతోంది. ప్రస్తుతం ఏకశిలా నగర్లో కబ్జాకు గురైన స్థలం మొత్తం 10వేల గజాల పైచిలుకు విస్తీర్ణం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. దీని వెనుక ఓ ప్రజాప్రతినిధి అండదండలు ఉన్నాయని, అక్రమార్కులకు పరోక్షంగా సహకారం అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.
Land encroachment | ప్రజావాణిలో ఫిర్యాదు
ఈ విషయమై స్థానికులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వివరించారు. వెంటనే స్పందించి స్థలాన్ని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.