అక్షరటుడే, వెబ్డెస్క్:Bengaluru Stampede | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) విజయోత్సవాల వేళ జరిగిన తొక్కిసలాట పెను విషాదం నింపింది. పదుల సంఖ్యలో అభిమానులు చనిపోయిన ఈ దారుణ హృదయ విదారక ఘటన యావత్ దేశాన్ని నివ్వెర పరిచింది.
కాగా.. ఈ విషాద సమయంలో విచారం వ్యక్తం చేయాల్సిన రాజకీయ నాయకులు కత్తులు దూసుకుంటున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government), ఇటు ప్రతిపక్షంలోని బీజేపీ (BJP) ఆరోపణలు, ప్రత్యారోపణలతో కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీజేపీ ఆరోపించింది. అయితే, పది మంది చనిపోతేనే బీజేపీ ఎందుకింత రాద్దాంతం చేస్తోందని కాంగ్రెస్ తప్పుబట్టింది. గతంలో కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట గురించి ఆ పార్టీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించింది. విషాద సమయంలోనూ రెండు పార్టీలు రాజకీయాలకు పాల్పడుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Bengaluru Stampede | గతంలో జరుగలేదా..?
బెంగళూరులో జరిగిన తొక్కిసలాటపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Karnataka Chief Minister Siddaramaiah) స్పందించారు. 11 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాటను తాను సమర్థించదలచుకోలేదని చెబుతూనే, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని బీజేపీ(BJP)ని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. తన ప్రభుత్వం ఈ విషాదకర ఘటనను రాజకీయం చేయదని పేర్కొన్నారు. బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టారు.
“ఇటువంటి ఘటనలు చాలాచోట్ల జరిగాయి, కుంభమేళాలో 50-60 మంది మరణించారు.” అయినా అప్పుడు మేము విమర్శించలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే అది వేరే విషయమని, తాను గానీ, కర్ణాటక ప్రభుత్వం(Karnataka Government) గానీ విమర్శించలేదని తెలిపారు. ప్రజలు స్టేడియం గేట్లను కూడా బద్దలు కొట్టుకుని లోనికి చొచ్చుకొచ్చారని, దీంతో తొక్కిసలాట జరిగిందని వివరణ ఇచ్చారు. ఇంత భారీ జనసమూహాన్ని ఎవరూ ఊహించలేదు. స్టేడియం సామర్థ్యం 35,000 మాత్రమే, కానీ 2-3 లక్షల మంది వచ్చారని, దీంతో పరిస్థితి చేయి దాటిపోయిందన్నారు.
Bengaluru Stampede | రాజీనామా చేయాలన్న బీజేపీ
మరోవైపు, తొక్కిసలాట ఘటన వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందని బీజేపీ ఆరోపించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి జి పరమేశ్వర (Home Minister G Parameshwara) 11 మంది మరణాలకు బాధ్యత వహించాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చిందని, సరైన ప్రణాళిక, భద్రతా ఏర్పాట్లు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించిందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర(B.Y. Vijayendra) ఆరోపించారు.
“సన్నద్ధంగా ఉండటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదా? లక్షలాది మంది ప్రజలు వస్తారని వారికి తెలియదా?” అని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Union Minister Pralhad Joshi) కూడా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సరైన ప్రణాళికలోపం కారణంగా ఇంత నష్టం జరగడం హృదయ విదారకంగా ఉందన్నారు.