అక్షరటుడే, కామారెడ్డి: SP Kamareddy | జిల్లావ్యాప్తంగా నేరాల నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ‘ఆపరేషన్ కవచ్’ (Operation Kavach) కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా అంతర్రాష్ట్ర దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గుదల, గంజాయి రవాణా వంటి కార్యకలాపాలను అరికట్టడంతో పాటు జిల్లాలో నేరాలను అదుపులోకి తీసుకువస్తున్నారు.
SP Kamareddy | రాత్రివేళల్లో ముమ్మర తనిఖీలు..
పోలీసులు రాత్రి వేళల్లో జిల్లావ్యాప్తంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ‘ఆపరేషన్ కవచ్’లో భాగంగా దేవునిపల్లి పోలీస్స్టేషన్ (Devunipalli police station) పరిధిలోని నర్సన్నపల్లి చౌరస్తా వద్ద రాత్రి సమయంలో పోలీస్ బృందం అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని సోదా చేస్తున్నారు. అనుమానిత వాహనాల ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు.
SP Kamareddy | ఆటోలో గంజాయి తరలిస్తుండగా..
కామారెడ్డి నుంచి హైదరాబాద్ (Hyderabad) వైపు వెళ్తున్న ఆటోను ఆపి అనుమానంతో పూర్తిగా తనిఖీ చేయగా అందులో కనిపెట్టకుంటా దాచిన గంజాయిని పోలీసులు గుర్తించారు. వెంటనే ఆటోలో గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పట్టుకొని దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించి వారిపై కేసు నమోదు చేశారు. తీవ్రమైన చలిలోనూ విధులు నిర్వహిస్తూ అప్రమత్తతతో వ్యవహరించి గంజాయి రవాణా చేస్తున్న నేరస్తులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన దేవునిపల్లి ఏఎస్సై నర్సయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు సుబ్బారెడ్డి, రెడ్డి నాయక్, సంతోష్, బలరాం, దేవునిపల్లి హోంగార్డు భూపతిలను ఎస్పీ అభినందించి క్యాష్ రివార్డుతో సత్కరించారు.
