అక్షరటుడే, ఇందూరు/నిజామాబాద్ సిటీ: Republic Day | జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో (Police Parade Ground) నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉదయం 9.00 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
Republic Day | పకడ్బందీ ఏర్పాట్లు..
రిపబ్లిక్ డే వేడుకకు ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇటీవలే అధికారులతో నిర్వహించిన సమీక్షలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. వేదిక, ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ఏర్పాట్ల గురించి సంబంధిత శాఖల అధికారులతో ఐ.డీ.ఓ.సీలో సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు పోలీస్ పరేడ్ మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో ముందుగానే వేడుకలు నిర్వహించనున్న పరేడ్ గ్రౌండ్‌ను అణువణువు తనిఖీలు నిర్వహించారు. సోమవారం సైతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
