అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Police | నిజామాబాద్ కమిషనరేట్ (Nizamabad Commissionerate) పరిధిలో ఓ పోలీసు అధికారి అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాడు. ప్రతీ కేసు నుంచి బలవంతపు వసూళ్లు చేయిస్తున్నాడు. దీంతో పలువురు బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ విషయమై కమిషనరేట్ పోలీసు బాస్ గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
ప్రమోషన్‌కు దగ్గరలో ఉన్న సదరు అధికారి.. ఇలా అడ్డగోలు వసూళ్లకు పాల్పడడంపై పోలీసు అధికారుల్లో (police officers) తీవ్ర చర్చ నడుస్తోంది. శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పెద్దపీట వేస్తున్నారు. ఇదే సమయంలో అవినీతికి పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు పది మందికి పైగా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే పలువురు అధికారులను సైతం బదిలీ చేశారు.
కానీ, కొందరు అధికారుల తీరులో మార్పు రాకపోవడంపై పోలీసు బాస్ గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఇదే విషయమై తాజాగా సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ‘ఓ స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా ఉన్న అధికారి కానిస్టేబుల్ ద్వారా ప్రతీ కేసు నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయని, తీరు మార్చుకోవాలని హెచ్చరించారు.’ లేనిపక్షంలో చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ చేశారు.
Nizamabad Police | ఆది నుంచి అదేతీరు..
సదరు అధికారి అక్రమ వసూళ్లపై ఓ బాధితుడు ఐజీ కార్యాలయానికి (IG office) ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో స్టేషన్ పరిధిలో జరుగుతున్న వసూళ్ల దందాపై స్పెషల్ బ్రాంచి సిబ్బంది సైతం సీపీకి వివరించినట్లు తెలిసింది. కాగా.. పేకాట కేసులు, కేసుల్లో నిందితులకు ఇచ్చే స్టేషన్ బెయిల్ పేరిట కాస్తో కూస్తో ఇవ్వాల్సిందే అనే కండీషన్ పెట్టడం గమనార్హం. సాధారణ పెట్టీ కేసుల నుంచి వసూళ్ల కోసం ప్రత్యేకంగా నియమించుకున్న ఓ కానిస్టేబుల్ ద్వారా వసూళ్ల పర్వం సాగించడం ఇందుకు నిదర్శనం. కాగా.. తీరు మార్చుకోని పక్షంలో అదును చూసి వేటు వేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.