అక్షరటుడే, వెబ్డెస్క్ : YS Jagan | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లా(Anakapalle District)లో పర్యటించనున్నారు. ముఖ్యంగా నర్సీపట్నంలో జరుగనున్న ఈ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకోవడంతో పాటు పోలీసుల ఆంక్షల నేపథ్యంలో సాగనుంది.
దీంతో కాస్త టెన్షన్ నెలకొంది. ముందుగా ఈ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించగా, అనంతరం 18 షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేశారు. పర్యటన సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు భద్రంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
YS Jagan | టెన్షన్ వాతావరణంలో..
జగన్ కాన్వాయ్(Jagan Convoy)లో కేవలం 10 వాహనాలకే అనుమతి ఇవ్వగా, ఊరేగింపులు, ర్యాలీలకు పూర్తిగా పర్మీషన్ నిరాకరించారు. బహిరంగ సభలు, భారీ జనసమీకరణలకు అనుమతి లేదు. నిర్దేశిత రూట్ కాకుండా వేరే రూట్‌లో ప్రయాణిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రజలు రోడ్ల పక్కన నిలబడి మాత్రమే తమ మద్దతును వ్యక్తం చేయాలని పోలీసులు సూచించారు. రాజకీయ పార్టీ అయినా, నాయకుల హోదా ఏదైనా అయినా నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే జగన్ పర్యటనకు ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం(State Government) తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే. ప్రభుత్వ వైద్య విద్యను ప్రైవేట్ రంగానికి అప్పగించడమంటే పేద విద్యార్థులకు, సామాన్య ప్రజలకు తగిన నష్టం జరుగుతుందని జగన్ ఆరోపిస్తున్నారు.
ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పోలీసుల ఆంక్షల నేపథ్యంలో, నర్సీపట్నంలో జరగాల్సిన భారీ బహిరంగ సభను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనితో జగన్(YS Jagan) వ్యూహంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ పర్యటనపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా ఆసక్తికర చర్చ మొదలైంది. పోలీసులు విధించిన ఆంక్షలు నడుమ జగన్ ఎలాంటి బల ప్రదర్శన చేస్తారన్న దానిపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో కుతూహలం నెలకొంది. అయితే నర్సీపట్నం పర్యటన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి గూడూరు సత్యకుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి పనులను నిర్లక్ష్యం చేసిన వ్యక్తి, ఇప్పుడు పర్యటనల పేరుతో రాజకీయ ప్రదర్శనలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.