అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Police | హైదరాబాద్ పోలీసులు సిబ్బందికి విధుల కేటాయింపులో సాంకేతికను వినియోగించనున్నారు. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (సీఏఆర్) సిబ్బంది విధుల కేటాయింపులో ‘జనరేటివ్ ఏఐ’ (Generative AI) విధానానికి శ్రీకారం చుట్టారు.
బషీర్‌బాగ్ పాత కమిషనర్ కార్యాలయంలో మంగళవారం సీపీ సజ్జనర్ (CP Sajjanar) ఉన్నతాధికారులతో కలిసి నూతన విధానాన్ని ప్రారంభించారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో విధులు కేటాయించేవారు. దీంతో జాప్యం జరగడంతో సమయం చాలా వృథా అయ్యేంది. వాటికి చెక్ పెడుతూ.. కేవలం రెండు నెలల్లోనే ఈ కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు.
Hyderabad Police | ప్రత్యేకతలు
ఈ కొత్త విధానం ద్వారా సిబ్బంది సీనియారిటీ, రిజర్వ్‌లో ఉన్న రోజులు, రివార్డులు, క్రమశిక్షణ, ఆరోగ్యం వంటి అంశాలను స్కోర్ ఆధారంగా పరిగణనలోకి తీసుకొని కంప్యూటరే విధులను ఖరారు చేస్తుంది. ఇందులో అధికారుల జోక్యం ఉండదు. ఓపెన్ ఏఐ సాయంతో డ్యూటీ అలాట్మెంట్ ఆర్డర్లు క్షణాల్లో తయారవుతాయి. దీంతో ఆఫీసు పనిభారం తగ్గి, పోలీసులు శాంతిభద్రతలపై మరింత దృష్టి పెట్టవచ్చు. ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక ‘ఏఐ చాట్ బాట్’ (AI chatbot) సైతం అందుబాటులో ఉంటుంది.
Hyderabad Police | 208 మందికి విధులు
ఈ విధానం ద్వారా పైలట్ ప్రాజెక్ట్ కింద 1,796 దరఖాస్తులను పరిశీలించి.. సెక్రెటేరియట్, సీఎం ఆఫీస్, ట్రాఫిక్ తదితర విభాగాల్లో 208 డ్యూటీలను సమర్థంగా కేటాయించినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. సిబ్బందికి విధుల కేటాయింపును పారదర్శకంగా, జవాబుదారీతనంతో మార్చడం కోసమే అత్యాధునిక ‘జనరేటివ్ ఏఐ’ విధానాన్ని ప్రారంభించామన్నారు. ఈ విధాన రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన హన్ష ఈక్విటీ పార్ట్నర్స్ ఎల్ఎల్పీని ఆయన అభినందించారు. సాంకేతికత ద్వారా పోస్టింగుల్లో అపోహలకు, అసంతృప్తికి తావులేకుండా చూస్తున్నామన్నారు. దీంతో సిబ్బందిపై మానసిక ఒత్తిడి తగ్గి విధుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ కానిస్టేబుళ్లకు జనరేటివ్ ఏఐ విధానం ద్వారా జారీ చేసిన డ్యూటీ అలాట్మెంట్ ఆర్డర్లను అందజేశారు.