అక్షరటుడే, ఆర్మూర్: Jeevan Reddy | జిల్లాలో కాంగ్రెస్ మార్క్ పోలీస్ రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (former Armur MLA Jeevan Reddy) ఆరోపించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో గురువారం పెర్కిట్ చౌరస్తాలో బీఆర్ఎస్ సానుభూతి పరుడు యాసిన్ చాయ్ హోటల్లో పార్టీ నేతలతో కలిసి చాయ్ తాగారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో (Armoor constituency) పోలీసు నిర్బంధకాండకు అడ్డూఅదుపు లేకుండాపోయిందని, కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లకు లొంగి బీఆర్ఎస్ నేతలు (BRS Leader), కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ సమయంలో యాసిన్ జీవన్ రెడ్డి వద్దకు వచ్చి పోలీసులు తనను వేధిస్తున్నారని, రాత్రి పూట కూడా చాయ్ దుకాణం నడుపుతున్నావంటూ అక్రమ కేసులు బనాయించారని వాపోయారు. దీనిపై స్పందించిన జీవన్ రెడ్డి సీఐకి ఫోన్ చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో పేకాట క్లబ్‌లు జోరుగా నడుస్తున్నాయని, మట్కా ఆడుతున్నారని వారిని వదిలేసి.. చాయ్ అమ్ముకునేవాళ్లపై చర్యలు చేపట్టడం ఏమిటని ఆయన సీఐని ప్రశ్నించారు.
Jeevan Reddy | పేకాటకు అడ్డగా కాంగ్రెస్ నాయకుని లాడ్జి..
నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకుడి (Congress leader) లాడ్జిలో పేకాట ఆడుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. మంత్రి పదవి రాలేదన్న కోపంతో సుదర్శన్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు తమ బంధువులైన పోలీస్ అధికారులను (police officers) దింపి వారి అండతో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మాఫియాల అవతారమెత్తి జిల్లాను దోచుకుంటున్నారని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
Jeevan Reddy | మున్సిపల్ కమిషనర్‌పై వ్యాఖ్యలు..
ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ (Armoor Municipal Commissioner) అరాచక శక్తిగా మారారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS government) ఎస్సీ, మైనార్టీ, మున్నూరు కాపు వర్గాలకు కేటాయించిన భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతలకు కమిషనర్ కొమ్ముకాస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. సీఐ దృష్టికి తీసుకువచ్చి అలాంటి కబ్జాకోరులకు పోలీస్ రక్షణ కల్పించడం ఎక్కడి న్యాయమని నిలదీశారు. చాయ్ వాలా యాసిన్ పై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే 10వేల మందితో పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో పోలీసుల అకృత్యాలను రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తెస్తామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
