అక్షరటుడే, నిజామాబాద్ సిటీ/బోధన్: CP Sai chaitanya | బోధన్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం కమిషనర్ వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్పూర్లో గల సైద్పూర్ రిజర్వాయర్, రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పాపూర్‌లో గల గుండ్ల వాగును, బోధన్ పట్టణంలోని షర్బత్ కెనాల్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లో లెవెల్ వంతెనల పైనుంచి వరద జాలాలు ప్రవహించేటప్పుడు ప్రజలు ఎవరూ రోడ్డు దాటడానికి ప్రయత్నించవద్దని సూచించారు. సమీపంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల వల్ల గ్రామాల్లోని కలిగే నష్టాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. జాలర్లు, పశువుల కాపర్లు, ప్రజలు ఎవరూ వాగులు, కాల్వలు, చెరువుల వద్దకు వెళ్లవద్దని సూచించారు.
రానున్న రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్లో లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూం 8712659700 నంబరును సంప్రదించాలని తెలిపారు. ఆయన వెంట బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్, రుద్రూర్ సీఐ ఆర్ కృష్ణ, వర్ని ఎస్సై మహేశ్, రుద్రూర్ ఎస్సై సాయన్న, వర్ని ఎంపీడీవో జి.వెంకటేశ్ తదితరులున్నారు.