అక్షరటుడే, వెబ్ డెస్క్: Nizamabad police | మైనర్ డ్రైవింగ్(Minor driving)పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
మైనర్లకు వాహనాలు ఇచ్చిన యజమానాలపై కేసులు సైతం నమోదు చేస్తున్నారు. ఇప్పటికే పలువురికి భారీగా జరిమానాలు విధించారు. కొందరు తల్లిదండ్రులు ఏకంగా జైలు పాలయ్యారు. అయినా కొందరు మైనర్లు మాత్రం దర్జాగా టూ వీలర్స్ తిప్పుతున్నారు. ఇలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు కమిషనరేట్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నగరంలోని ఇద్దరు బాలురు డ్రైవింగ్(Minor driving) చేస్తుండగా శనివారం సాయంత్రం కోర్టు చౌరస్తాలో సీపీ సాయిచైతన్య(CP Saichaitanya) పట్టుకున్నారు. కాగా.. ఇద్దరు బాలురు సామాజిక సేవలో భాగంగా ఆదివారం ట్రాఫిక్ నిబంధనలపై ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు(traffic awareness) పాటించాలని.. వాహనదారులు హెల్మెట్ ధరించాలని ఇలా ట్రాఫిక్ కూడలి వద్ద అవగాహన కల్పించారు. కాగా.. పోలీసులు తీసుకున్న ఈ చర్య సర్వత్రా చర్చకు దారితీసింది. మరోవైపు మైనర్లకు వాహనాలు ఇచ్చి తప్పు చేస్తున్న పెద్దలను ఆలోచింపజేస్తోంది.