అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురిలో ఒకరు మైనర్ కాగా మరొకరు ఆర్మీలో (ARMY) ఉద్యోగం వదిలి ముఠాలో పని చేస్తున్నాడు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (Sp Rajesh Chandra) శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు. గత నెల 25న కామారెడ్డిలో ఓ వ్యక్తి తనను కొందరు వ్యక్తులు ఫొటోలు మార్ఫింగ్ (Photo morphing) చేసి సోషల్ మీడియాలో (Social media) అప్లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
Kamareddy | ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో విచారణ
కామారెడ్డి(Kamareddy) సబ్‌డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి Subdivision ASP Chaitanya Reddy ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. బాధితుడు డబ్బులు పంపిన ఫోన్‌పే ట్రాన్సక్షన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు కామారెడ్డికి చెందిన వారిగా గుర్తించారు. శనివారం సంబంధిత నేరస్థులు కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమయ్యారన్న పక్కా సమాచారంతో పోలీసులు ఐదుగురిని పట్టుకున్నారు. వీరిని విచారించగా సుమారు 40-50 మంది వద్ద ఇలాగే డబ్బులు తీసుకున్నట్టుగా ఒప్పుకున్నారు.
అయితే వీరిపై ప్రస్తుతం కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు, తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2, నిజామాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదయ్యాయి. నేరస్థులు కామారెడ్డి పట్టణానికి చెందిన షేక్ జోహాబ్, మహమ్మద్ మిరాజ్ పాషా, సయ్యద్ ముజఫర్ అలీ, ఒక మైనర్, సిరిసిల్ల మండలం చంద్రంపేటకు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి షేక్ సోహైల్‌లను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు.
వీరు సోషల్ మీడియా ద్వారా యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని యాప్‌ల ద్వారా అమాయకులను పరిచయం చేసుకుని వారిని మీటింగ్ ఉందని కామారెడ్డి పట్టణంలోని మేఘా కార్ షెడ్ వద్దకు పిలిచి మీ చాటింగ్స్ మావద్ద ఉన్నాయి. మీ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించి కొడుతూ వారి వద్ద ఉన్న నగదు, వస్తువులు లాక్కుంటారని తెలిపారు. మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా బాధితుల ఫోన్ల నుంచి డబ్బులు ట్రాన్సక్షన్ చేసుకుంటారని వెల్లడించారు.
ఇలా ఇప్పటివరకు వీరు రూ. 7లక్షల నుంచి 8 లక్షల వరకు డబ్బులు దోచుకున్నట్టు తెలిపారు. వీరి నుంచి రూ.96,350 రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్న బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని సూచించారు. నాందేడ్ జిల్లాకు చెందిన బాధితులు కూడా ఉన్నట్టు సమాచారం ఉందని, అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. సోషల్ మీడియా, యాప్స్ ద్వారా పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని ఎస్పీ సూచించారు.